Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ కుమారుడికి వేల కోట్ల ఆస్తులు..?
ఇరాన్ ను 40 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పరపాలిస్తున్న అయాతుల్లా ఖమేనీ వేలకోట్లకు పడగలెత్తారా..? ఆయన కనుసన్నల్లో కుమారుడు మోజ్తబా ఖమేనీ.. విదేశాల్లో వేలకోట్లు కూడబెట్టారా..? లండన్లోని అత్యంత ఖరీదైన ‘బిలియనీర్స్ రో’ (The Bishops Avenue) నుంచి జర్మనీలోని ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించినట్లు బ్లూమ్ బెర్గ్ కథనం వెల్లడించింది..
అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, మోజ్తబా(MOJTABA KHAMENI) ఈ ఆస్తులను అత్యంత రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా తన పేరు నేరుగా కనిపించకుండా, షెల్ కంపెనీలు, బినామీల ద్వారా ఈ నెట్వర్క్ నడుస్తోంది. బ్రిటన్ గతేడాది ఆంక్షలు విధించిన ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీ, ఈ ఆస్తుల వెనుక ఉన్న ప్రధాన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
కేవలం ఒక్క భవనం కోసమే 2014లో సుమారు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, స్పెయిన్లోని మల్లోర్కాలో లగ్జరీ హోటళ్లు ఈ నెట్వర్క్ పరిధిలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్, యూఏఈ, బ్రిటన్ బ్యాంకులను వాడుకుని ఇరాన్ చమురు సొమ్మును విదేశాలకు చేరవేసినట్లు నివేదిక పేర్కొంది.
ఇరాన్లో సామాన్యులు తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆకలితో అలమటిస్తుంటే.. పాలక వర్గం మాత్రం విదేశాల్లో ‘అఘాజాదే’ (అధికారుల పిల్లలు) పేరిట విలాసవంతమైన జీవితాలను గడుపుతోందని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న మోజ్తబా పేరు మీద ఈ తరహా అవినీతి ఆరోపణలు రావడం ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఖమేనీ కుటుంబాన్ని అత్యంత పేదరికంలో ఉండే ‘ఫకీర్’ కుటుంబంలా చిత్రీకరిస్తోంది. కానీ, విదేశీ నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం.. మోజ్తబా కేవలం ఆస్తులు కలిగి వుండడమే కాకుండా, ఇరాన్ సైనిక విభాగం ‘రివల్యూషనరీ గార్డ్స్’పై కూడా బలమైన పట్టు కలిగి ఉన్నారు. తాజాగా బహిర్గతమైన నివేదిక… ఇరాన్ అంతర్గత రాజకీయాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.






