Iran: ఆ ఇద్దరినీ వదలం, ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు అత్యంత భయానక రూపం దాల్చింది. మానవత్వాన్ని మంటగలుపుతూ ఇరాన్ లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర దాడిలో 170 మందికి పైగా అమాయక విద్యార్థులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టిన అసలైన సూత్రధారులు ఎవరో ఇరాన్ ఇప్పుడు ఆధారాలతో సహా బయటపెట్టింది. మినాబ్ పాఠశాలపై జరిగిన ఈ క్షిపణి దాడి వెనుక అమెరికా నావికాదళానికి(American Navy) చెందిన ఇద్దరు కీలక అధికారులు ఉన్నారని ఇరాన్ పేర్కొంది.
ఆ ఇద్దరు అధికారుల పేర్లను ఇరాన్ అధికారికంగా వెల్లడిస్తూ ప్రపంచ దేశాల ముందు వారిని ‘యుద్ధ నేరస్తులు’గా నిలబెట్టింది. ఈ ఇద్దరు నేరస్తులను గుర్తుంచుకోండి అంటూ ఇరాన్ తన ప్రకటనలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఇద్దరు అధికారుల ఆదేశాల మేరకే క్షిపణిని ప్రయోగించారని, అమాయక చిన్నారుల రక్తంతో అమెరికా చేతులు తడిశాయని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ 9 కమాండర్ రియర్ అడ్మిరల్ క్రిస్టోఫర్ అలెగ్జాండర్, గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ ఫిలిప్పైన్ సీ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ గిల్బర్ట్ అయాన్ ఈ దాడికి ప్రధాన సూత్రధారులు అని ఇరాన్ ఆరోపించింది.
ఈ ఇద్దరు అధికారుల కనుసన్నల్లోనే ఈ వినాశనం జరిగిందని ఇరాన్ గట్టిగా ఆరోపిస్తోంది. తమ దేశంలోని చిన్నారుల రక్తంతో చేతులు తడిపేసుకున్న వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. సాధారణంగా యుద్ధ సమయంలో ఉన్నత స్థాయి అధికారుల పేర్లను ఇలా బహిరంగంగా వెల్లడించడం చాలా అరుదు, కానీ ఈ ఘటనను ఇరాన్ అంతర్జాతీయ స్థాయిలో ‘యుద్ధ నేరం’గా పరిగణిస్తోంది. అమెరికా నావికాదళానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారుల పేర్లను ఇరాన్ నేరుగా ప్రస్తావించడంతో పెంటగాన్(pentagon) వర్గాల్లో కలకలం మొదలైంది. ఒక విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికే మచ్చ అని, దీనికి ఈ ఇద్దరు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి








