ఇజ్రాయెల్ నేలపై చత్రపతి శివాజీ.. స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్ షిప్…!
చత్రపతి శివాజీ మహరాజ్.. మరాఠీల దైవం.. భారతీయులకు ఆయనొక గర్వకారణమైన వీరుడు. అందుకే శివాజీ పేరు చెబితే భారతీయుల హృదయాలు ఉప్పొంగుతాయి. అయితే ఆయన మనకే కాదు.. యూదులకు ఓ గొప్ప మార్గదర్శకుడు. అందుకే ఆయన విగ్రహాన్ని తమనేలపై ప్రతిష్టించాలని ఇజ్రాయెల్ సర్కార్ తలుస్తోంది. తమ దేశంలోని ఓ పెద్దనగరంలో మహారాజా శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించాలని ఇజ్రాయెల్ కోరగా.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అంగీకరించారు.
న్యూఢిల్లీ, టెల్ అవీవ్‌ల మధ్య పెరుగుతున్న సాంస్కృతిక సంబంధాల నేపథ్యంలో, దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం (శివ రాజ్యాభిషేక్ దిన్) సందర్భంగా ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ ఈ అధికారిక ప్రకటన చేశారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన, మత సామరస్యం మరియు నౌకాదళ వ్యూహాలు వంటి విలువలు ఇజ్రాయెల్ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ మైత్రీ భావంతోనే ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించినట్లు రెవాచ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
“ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంపై ఎంతటి ప్రభావం కలిగి ఉన్నారో, ఎంత ముఖ్యమైనవారో మాకు స్పష్టంగా తెలుసు… మహారాజ్ యొక్క భారీ విగ్రహాన్ని నిర్మించి ఇజ్రాయెల్‌కు పంపాలన్నది మా ఆలోచన. ఇది కేవలం ఒక సాధారణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలతో కూడా అనుసంధానం అవుతారు. ఇజ్రాయెల్‌లోని ఒక పెద్ద నగరానికి దీనిని తీసుకురావాలని మేము యోచిస్తున్నామన్నారు.శివాజీ వారసత్వానికి తగినట్లుగా స్మారక చిహ్నాన్ని తీర్చిదిద్దేందుకు, చారిత్రక ఆధారాలు, కళాత్మక సంప్రదింపులు, డిజైన్ అంశాలకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహకారాన్ని ఇజ్రాయెల్ కోరగా, “ఆయన వెంటనే దానిని అందించడానికి అంగీకరించారు” అని రెవాచ్ చెప్పారు.
“నేను భారతదేశంలో ఎక్కడికి ప్రయాణించినా, ఇజ్రాయెల్ పట్ల, మన జాతీయ వీరుల పట్ల ప్రజల కళ్లలో గొప్ప గౌరవాన్ని చూస్తాను. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మరింత అవగాహన కల్పించడానికి మనం కృషి చేయాలని నేను నమ్ముతున్నాను. ఈ స్నేహ స్ఫూర్తితోనే, ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్, ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది,” అని రెవాచ్ తెలిపారు.








