మరాఠాలు.. యూదుల మధ్య చారిత్రక బంధం..?
ఇజ్రాయెల్.. తన దేశంలోని ఓ అతిపెద్దనగరంలో శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలుస్తోంది. దీనికి సహకారమందిస్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హామీ కూడా ఇచ్చారు. ఇంతకూ ఎక్కడో వేలకిలోమీటర్ల దూరాన ఉన్న యూదురాజ్యానికి.. మరాఠా గడ్డపై ఛత్రపతిగా వెలిగిన శివాజీ రాజ్యానికి ఎలా సంబంధం ఏర్పడింది. అసలు శివాజీని.. యూదులు ఎందుకు స్ఫూర్తి ప్రధాతగా తలుస్తున్నారు. శివాజీ చరిత్రను తన ప్రజలకు ఎందుకు సవివరంగా పరిచయం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాష్ట్రలోని తీర ప్రాంతంలో స్థిరపడిన ‘బెనె ఇజ్రాయెల్’ (Bene Israel) అనే యూదు సమాజానికి మధ్య 17వ శతాబ్దం నుంచే బలమైన, చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూదులు ఎన్నో ప్రాంతాలలో వివక్షకు గురవుతున్న సమయంలో.. శివాజీ తన రాజ్యంలో వారికి పూర్తి భద్రత, గౌరవం, మత స్వేచ్ఛను కల్పించారు.
యూదుల యుద్ధ నైపుణ్యాలను, వారి పట్టుదలను గుర్తించిన వీర శివాజీ.. వారిని తన సైన్యంలో, నౌకాదళంలో కీలక పదవుల్లో నియమించారు. మరాఠా నావికాదళంలో ‘ఆరోన్ చురికర్’ వంటి యూదు సైనికులు ఎంతో ప్రతిభ కనబరిచారు.కొంకణ్ తీరంలో స్థిరపడిన యూదులను అప్పట్లో ‘శనివార్ తేలీ’ అని పిలిచేవారు. మరాఠా రాజ్యంలో ఏ మతం పట్ల వివక్ష చూపని శివాజీ.. యూదులకు స్వేచ్ఛనిచ్చి, వారి సంస్కృతిని పరిరక్షించారు.
భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య మైత్రీ బంధానికి …మరాఠా-యూదుల చారిత్రక సంబంధాలకు ప్రతీకగా.. ఇజ్రాయెల్‌లోని ఒక ప్రముఖ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆ దేశం నిర్ణయించింది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్, దీనికి సంబంధించిన ప్రణాళికలను ప్రకటించింది.








