Pakistan: ఇరాన్ యుద్దం ఆపే ప్రయత్నాల్లో పాకిస్తాన్…?
పశ్చిమాసియా బాంబు దాడులతో భగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ -, ఇరాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఇంతలో అనూహ్యంగా అమెరికా 5 రోజుల పాటు యుద్ధ విరామం ప్రకటించింది. అమెరికా యుద్ధ విరమణ ప్రకటన ప్రపంచదేశాలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనికి ట్రంప్ తనదైన రీతిలో బదులిచ్చారు. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని.. అందుకే 5 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇచ్చామన్నారు. అనుకున్నట్లుగా చర్చలు సాగితే.. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని సైతం స్వాధీనం చేసుకుంటామన్నారు.
ఇంతకూ ఈ బద్ధశత్రువుల మధ్య మధ్యవర్తిత్వం చేస్తోంది ఎవరో కాదు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్.
యుద్ధం తీవ్రం అవుతున్న వేళ తాను మధ్యవర్తిగా వ్యవహరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇరాన్‌తో పాటు అటు అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశమైన సౌదీతో ప్రత్యేకంగా రక్షణ ఒప్పందం కూడా పాకిస్తాన్ (Pakistan)చేసుకుంది. ఈ మూడు కారణాల వల్ల పాకిస్తాన్ ‘మీడియేటర్’గా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ మాటల ప్రకారం ఆయన అల్లుడు కుష్నర్.. ఈ చర్చల్లో కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పొడవునా కొనసాగనున్న ఈ లోతైన, వివరణాత్మక, నిర్మాణాత్మక చర్చల సరళిని దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయవలసిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించాను. ఈ నిర్ణయం కొనసాగింపు అన్నది ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల సఫలత మీద ఆధారపడి ఉంటుంది” అని ఆ పోస్టులో డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ వారంలోనే చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు ఉండే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ విషయమై చర్చలు జరిపారు.
ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఒక డీల్ కుదురుతుందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ వీటన్నింటిని ఖండించింది. ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే, కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయని ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
ఇరాన్ తర్వాత, పాకిస్తాన్‌లోనే అతిపెద్ద షియా ముస్లిం జనాభా ఉంది. గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు ఉండటం పాకిస్తాన్‌కు లాభిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో అసిం మునీర్, షరీఫ్‌లో ట్రంప్‌ను వైట్‌హౌజ్‌లో కలిశారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మధ్యవర్తిత్వంలో పాక్ విజయవంతమైతే ప్రాంతీయ శాంతికి దోహదం చేయడంతో పాటు, అంతర్జాతీయం దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రస్తుతం, పాక్‌లో ఉన్న సమస్యల్ని కొంతకాలం పాటు పక్కదారి పట్టించే అవకాశం కూడా అక్కడి సైన్యం, పాలకులకు దొరుకుతుంది.








