Dubai: దుబాయ్ ను వణికిస్తున్న ఇరాన్, తీవ్రత పెంచి మరీ..!
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమవుతోన్న సమయంలో ఇరాన్ దూకుడు పెంచింది. దుబాయ్ సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని కీలక నగరాలపై ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ దాడులు నేడు కొత్త మలుపు తిరిగాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలకు సహకరిస్తున్నారన్న కోపంతో.. క్షిపణులు, డ్రోన్లతో దుబాయ్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది ఇరాన్. దుబాయ్, అబుదాబి, ఫుజైరాలోని ఓడరేవులను (Ports) వెంటనే ఖాళీ చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
ఇక్కడి పోర్టులను అమెరికా తన దాడుల కోసం స్థావరాలుగా వాడుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. నేడు తెల్లవారుజామున దుబాయ్‌లోని మెరీనా (Marina), అల్ సుఫౌ ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను, మిస్సైళ్లను ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defense) అడ్డుకున్న సమయంలో ఈ శబ్దాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్కరోజే యూఏఈ రక్షణ శాఖ 9 బాలిస్టిక్ మిస్సైళ్లను, 33 డ్రోన్లను కూల్చివేసింది.
యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 1,600 డ్రోన్లను, 300 పైగా మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. బుర్జ్ అల్ అరబ్ హోటల్ పై కూడా ఈ దాడుల ప్రభావం పడింది. ఇరాన్ లో దీనిని ఐకానిక్ హోటల్ గా చెప్తూ ఉంటారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ జరిగిన దాడుల వల్ల రన్ వేలు, టెర్మినల్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో విమాన సర్వీసులు మరోసారి ఆపేసింది దుబాయ్. జెబెల్ అలీ పోర్ట్ పై జరిగిన క్షిపణి దాడుల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించాయని, సరుకు రవాణాకు ఆటంకం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొంది.
అధికారిక లెక్కల ప్రకారం, ఈ దాడుల వల్ల ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 140 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో పాకిస్థాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్ లోని షేక్ జాయెద్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లో సైరన్ల మోత వినిపిస్తోంది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తన పౌరులకు సూచించింది. విదేశీయులు చాలా మంది దుబాయ్‌ను వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల ప్రైవేట్ జెట్ విమానాల ధరలు భారీగా పెరిగాయి. ఈ దాడులతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.








