Iran: ఇరాన్ గడ్డపై అమెరికా బలగాలు..? పెంటగాన్ ప్లాన్ ఏంటీ..?
అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు భౌగోళికంగా మారనుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై సంయుక్త దాడులు ప్రారంభించినప్పటి క్షిపణులు(Missile) లేదా డ్రోన్ లతోనే యుద్ధం జరుగుతోంది. 20 రోజులు దాటినా.. ఓ కొలిక్కి రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా తన బలగాలను ఇరాన్ భూభాగంలోకి పంపే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పెంటగాన్ అధికారులు ఇరాన్ గడ్డ మీదకు, భూతల దళాలను పంపడానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) సమర్పించినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ట్రంప్ తాను దళాలను ఎక్కడికీ పంపడం లేదు అని చెబుతూనే, మరోవైపు ఒకవేళ పంపాల్సి వస్తే ఆ విషయాన్నిమీడియాకు చెప్పను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఇప్పటికే అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్లను, యుద్ధనౌకలను మధ్యప్రాచ్యానికి పంపింది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి లేదా అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ మెరైన్లను ఉపయోగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేయడం, వారి నావికాదళాన్ని అణచివేయడం, అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఈ యుద్ధ ప్రధాన లక్ష్యాలని వైట్ హౌస్ తెలిపింది.
యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, పెంటగాన్ అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులను కాంగ్రెస్(Congress) నుండి కోరింది. ఈ భారీ బడ్జెట్ అభ్యర్థన యుద్ధ తీవ్రతను సూచిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతానికి అమెరికా కేవలం గగనతలం, సముద్రం నుండి దాడులు చేస్తోంది. భూతల దళాలను పంపడం వల్ల అమెరికా సైనికులకు ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉండటంతో, ట్రంప్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఇరాన్ కూడా ఒకవేళ తమ భూభాగంపై దాడి జరిగితే తీవ్రమైన ప్రతిదాడి చేస్తామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి








