గల్ఫ్ దేశాల పునర్నిర్మాణంపై అమెరికా ఫోకస్..ఇరాన్ ఆస్తులపై కన్ను..!
పశ్చిమాసియా యుద్దం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గల్ఫ్ దేశాలు.. తమకు పరిహారం చెల్లించాలని అమెరికాను డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని అమెరికన్ ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ.. వాటితో ఉన్న మైత్రి దృష్ట్యా.. ఈ డిమాండ్ ను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే…దీనికి ప్రధాన కారణమైన ఇరాన్ ఆస్తులను స్వాధీనం చేసుకుని.. వాటిని గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి వాడుకుంటే బాగుంటుందన్న భావనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ మిత్రదేశాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక బృందాన్ని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఇరాన్ ఆస్తులను (Iranian Assets) ఉపయోగించడాన్ని వారు పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ఈ ఆస్తులను భవిష్యత్తు పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం కాకుండా.. ఇప్పటికే భాగస్వాములకు జరిగిన నష్టానికి పరిహారంగా అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి.
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. సైనిక ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. శాంతి ఒప్పందంపై కూడా అనిశ్చితి నెలకొంది. శాంతి ఒప్పందం కుదరాలంటే.. ముందుగా అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ ఇటీవల డిమాండ్ చేసింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఆస్తులను ఉపయోగించాలని అమెరికా యోచిస్తోందనే వార్తలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.








