US-Iran War: చమురు సంక్షోభాన్ని తగ్గించేందుకు అమెరికా, జపాన్ ప్రయత్నాలు..!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చమురు సరఫరాపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో రాబోయే ఉపద్రవాన్ని తలచుకుని ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి అయితే అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇన్నాళ్లు హాయిగా ఉన్న తాము ఈ యుద్ధం కారణంగా .. ఇబ్బందులు పడుతున్నామని ఇతర దేశాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న చమురు నిల్వలను (Oil reserves) విడుదల చేసేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించుకుంటుందని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో చమురు ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభించినట్లు యూఎస్ ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ పేర్కొన్నారు. ఇందులోభాగంగా తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి ఇది ప్రారంభమవుతుందని.. మొత్తం విడుదలకు దాదాపు 120 రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు జపాన్ కూడా అమెరికా బాటనే ఎందుకుంది. తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేస్తామని తెలిపింది. మార్చి 16వ తేదీ నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని సనయే తకయిచి వెల్లడించారు.
మార్చి 16 నుంచి చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల వేళ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు తమ వద్ద ఉన్న చమురు నిల్వలను విడుదల చేస్తామని అన్నారు. ప్రైవేటు రంగ సంస్థల చమురు నిల్వలను, ప్రభుత్వరంగ చమురు నిల్వలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అప్పుడు చమురు లభ్యత పెరిగి ధరల స్థిరీకరణకు దోహదపడుతుందని అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాల ఆర్థిక మంత్రులు ఆన్లైన్ ద్వారా సమావేశమై, ఇంధన సరఫరాల్లోని అంతరాయంపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు నిల్వలను విడుదల చేసి మద్దతుగా నిలువాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ జీ7 దేశాలను కోరింది. కాగా, తమ వద్ద ఉన్న చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించిన తొలి జీ7 దేశం జపాన్ కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి








