PM Modi: పశ్చిమాసియా సంక్షోభంపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో (Middle East) నెలకొన్న తీవ్ర యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులను (NRIs), స్వదేశంలోని వారి కుటుంబాలను భయాందోళనలకు గురిచేసేలా కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ పర్యటనలో భాగంగా ఎర్నాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లోని భారతీయులకు అండ..
గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం సహజమేనని, అయితే కేంద్రంలో ఉన్నది ఎన్డీయే (NDA) ప్రభుత్వమనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని ప్రధాని (PM Modi) భరోసా ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకున్న ప్రతిసారీ భారత పౌరులను సురక్షితంగా రక్షించేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
“మన పౌరులను మేం ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (Embassies) మన పౌరుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉన్నాయి. అక్కడి మన మిత్రదేశాలు సైతం భారతీయుల భద్రతను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి” అని ఆయన (PM Modi) వివరించారు.
ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌పై విమర్శలు..
ఇంతటి సున్నితమైన, క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని మోదీ (PM Modi) విమర్శించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలనే ఏకైక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ తప్పుడు ప్రచారం కోసం ఆ పార్టీ నాయకులు ఏకంగా సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసుకుంటారేమో” అంటూ కాంగ్రెస్ తీరును ఆయన ఎద్దేవా చేశారు.
స్వయం సమృద్ధే లక్ష్యం..
ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు.. దేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి (Self-reliance) ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తున్నాయని ప్రధాని (PM Modi) అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ లక్ష్యాలను సాకారం చేయడంలో పెట్రోలియం రంగాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఆయన కొచ్చి రిఫైనరీ వద్ద నూతన ‘పాలీప్రొపిలీన్ (Polypropylene) యూనిట్’కు శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి








