John Kerry: ట్రంప్ ను బుట్టలో పడేసిన నెతన్యాహు.. !
జార్జిబుష్ కాదన్నారు.. ఒబామా ససేమిరా అన్నారు.. జో బైడన్ నో చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం వెంటనే ఎస్ అనేశారు. ఇరాన్ పై యుద్ధం చేద్దామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదనను.. అంతకు ముందు అధ్యక్షులు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే.. ట్రంప్ మాత్రం ఎస్ ప్రోసీడ్ అన్నారు. ఇప్పుడు అమెరికన్లను యుద్ధక్షేత్రంలో నిలబెడుతున్నారు. ఈమాటంది ఎవరో కాదు.. అమెరికా మాజీ విదేశాంగమంత్రి జాన్ కెర్రీ. ఇటీవల ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
“ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బర్ట్” కార్యక్రమంలో కెర్రీ మాట్లాడుతూ.. “మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్.. అందరూ నెతన్యాహు ప్రతిపాదనకు ‘నో’ చెప్పారు. ఆ చర్చల్లో నేను కూడా భాగస్వామిని” అని స్పష్టం చేశారు. శాంతియుత మార్గాలు ఇంకా అందుబాటులో ఉన్నందున వారు యుద్ధానికి అంగీకరించలేదని వివరించారు.
అయితే, డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారని కెర్రీ తెలిపారు. ఇరాన్లో సులభంగా పాలన మార్పు వస్తుందని, ప్రజలే తిరగబడతారని నమ్మబలికినట్లు చెప్పారు. దీనికి ట్రంప్, “నాకు బాగానే అనిపిస్తోంది” అంటూ ఉమ్మడి ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ నివేదికను ఉటంకించారు. కానీ, నెతన్యాహు అంచనాలు తప్పాయని, అక్కడ అలాంటిదేమీ జరగలేదని అన్నారు.
ఇటీవల, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా …ఇరాన్‌పై నెతన్యాహు అంచనాల గురించి ఆయనతో ఫోన్లో వాదించినట్లు వార్తలు వచ్చాయి. వియత్నాం, ఇరాక్ యుద్ధాల అనుభవాలను గుర్తుచేస్తూ.. అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి వారి పిల్లలను యుద్ధానికి పంపకూడదని కెర్రీ హితవు పలికారు.








