మమత ‘‘నీడే’’ ఇప్పుడు ఏకుమేకై.. పునాదులు కదిలిచింది
సువేందు అధికారి. బెంగాల్ లో మార్మోగిపోతున్న పేరు. ఒకప్పుడు మమతా బెనర్జీకి నీడలా పనిచేసిన నాయకుడు, ఒక్కసారిగా ఆత్మ గౌరవం పేరుతో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అంతే.. మమతా బెనర్జీకి ఏకుమేకై కూర్చున్నారు. దీదీయే పోరాట శీలి అంటే.. అంతే దీటుగా రాజకీయ క్షేత్రంలో నిలబడ్డారు. బెంగాల్ లో బీజేపీ విజయ ఢంకా మోగించడం వెనుక ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా వ్యూహం, పనితీరు ఎంత వుందో.. సుబేందు అధికారి వ్యూహం, కష్టం కూడా అంతే వుంది. ఏమాత్రం తీసిపోరాదు. కార్య క్షేత్రంలో తృణమూల్ కాంగ్రెస్ ని తట్టుకొని నిలబడిన ధీశాలి. మమతతో చాలా సంవత్సరాలు పని చేసిన కారణంగా ఆమె వేసే ప్రతి అడుగూ సుబేందుకు కొట్టిన పిండే.
అంతేకాకుండా బీజేపీ కూడా సుబేందును బాగా ప్రోత్సహించింది. బయటి వ్యక్తి అని ఎక్కడా తేడా రాకుండా అత్యంత జాగ్రత్తగా సుబేందును తయారు చేస్తూ వచ్చింది. మమతా బెనర్జీ ఒకటంటే.. సుబేందు రెండు మాటలు అనేంత స్థాయికి చేరుకుంది. ఇంతకు ముందు బీజేపీలో ఇంతటి ధీశాలులు లేరు. కొందరు వున్నా.. మమతాను తట్టుకోవడంలో వెనకబడిపోయారు. కానీ సుబేందు తెరపైకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.
అయితే.. ప్రస్తుతం బీజేపీ విజయ ఢంకా మోగించింది. అధికార పగ్గాలు సుబేందు చేతికే వస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే.. చివరి వరకూ బీజేపీలో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేం. ఒకప్పుడు మమతా బెనర్జీకి చేదోడు వాదోడుగా వున్న సుబేందు.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మమతా బెనర్జీకి మరింత పుండుమీద కారం చల్లినట్లవుతోంది. అంతేకాకుండా మమతకు కుడి భుజంలా వున్న సుబేందు.. ఇప్పుడు మమతా దీదీని అధికారం నుంచి దహించేయడంలోనూ సహాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
లంకాధిపతి రావణుడి రహస్యాలు, బలాబలాలు తెలిసింది ఒక్క విభీషణునికే.చివరికి రావణాసురుడిని ఎక్కడ కొడితే.. నేలకొరిగి పోతాడో రాముడికి చెప్పింది విభీషణుడే. అలా టీఎంసీ, మమతా బెనర్జీ బలాబలాలు పూర్తిగా తెలిసింది సుబేందుకే. వాటన్నింటినీ బీజేపీ పుష్కలంగా వాడేసుకుంది. ఇప్పుడు అధికార పీఠానికి చేరువైంది.
2026 ఎన్నికల్లో కూడా సుబేందు నందిగ్రామ్ తో పాటు మమత బరిలో దిగిన భవానీ పూర్ నుంచి కూడా బరిలోకి నిలిచారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్ లో సువేందు కుటుంబానికి బలమైన పట్టు వుంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన పోరాట పంథాను కొనసాగించారు. చొరబాట్లను వ్యతిరేకించారు.టీఎంసీ ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహంతో పాటు సువేందు పోస్టర్ బాయ్ గా కూడా బాగా కలిసొచ్చారు. దీంతో బీజేపీ అధికారం సాధించింది.
నిజానికి సువేందు రాజకీయ జీవితాన్ని మార్చేసింది నందిగ్రామ్. 2007 లో నందిగ్రామ్ లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించింది సుబేందుయే. కమ్యూనిస్టు నేతలకు చుక్కలు చూపించారు. రైతుల భూములు కాపాడడానికి మమతా బెనర్జీకి తోడుగా నిలిచారు. దీంతో ఈ ఒక్క అంశమే టీఎంసీకి వెయ్యి ఏనుగుల బలాన్ని తెచ్చిపెట్టింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు బాగా నడిచాయి. దీంతో కమ్యూనిస్టులకు తీవ్ర తలనొప్పిగా మారిపోయింది. 2011 లో టీఎంసీ అధికారంలోకి రావడానికి మమత తో పాటు సుబేందు పాత్ర కూడా చాలానే వుంది. ఆ తర్వాత టీఎంసీలో ప్రభుత్వంలో వివిధ శాఖలను కూడా నిర్వహించారు. ఆ తర్వాత మమతతో పొరపొచ్చాలు వచ్చి, బీజేపీలో చేరిపోయారు.
ఇవి కూడా చదవండి








