Supreme Court: హరీశ్ రాణాకు విముక్తి.. నాటి అరుణా షాన్‌బాగ్ పోరాటమే పునాది!
గత 13 ఏళ్లుగా కోమాలో ఉంటూ జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ‘కారుణ్య మరణం’ (Passive Euthanasia) ప్రసాదించింది. అతడికి అందిస్తున్న ప్రాణాధార చికిత్స (లైఫ్ సపోర్ట్) వ్యవస్థలను తొలగించేందుకు చారిత్రాత్మక అనుమతినిచ్చింది. మన దేశ న్యాయ చరిత్రలో ఒక వ్యక్తికి కారుణ్య మరణానికి అధికారికంగా అనుమతి దక్కడం ఇదే తొలిసారి. అయితే ఈ చారిత్రక తీర్పు వెనుక సుమారు నాలుగు దశాబ్దాల ఒక కన్నీటి కథ, సుదీర్ఘ న్యాయపోరాటం దాగి ఉన్నాయి. ఆ పోరాటానికి నాంది పలికిన పేరే ‘అరుణా షాన్‌బాగ్’.
ఎవరీ అరుణా షాన్‌బాగ్?
మహారాష్ట్రలోని కేఈఎం ఆసుపత్రిలో అరుణ (25) నర్సుగా పనిచేసేవారు. 1973 నవంబర్ 27 రాత్రి సోహన్‌లాల్ అనే వార్డుబాయ్ ఆమెపై (Aruna Shanbaug) అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుక్కలను కట్టేసే గొలుసుతో ఆమె గొంతు నులమడంతో, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కోలుకోలేని విధంగా దెబ్బతింది. మాట పడిపోయి, కదలలేని స్థితిలో కోమాలోకి వెళ్లిన ఆమె కోసం అదే ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 ఏళ్ల పాటు ఆమె మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించింది.
ఇవి కూడా చదవండి
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
అరుణ (Aruna Shanbaug) దయనీయ స్థితిని చూసి చలించిన జర్నలిస్ట్ పింకీ విరాణి.. ఆమెకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడే తొలిసారిగా కోర్టు ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరిపి పలు మార్గదర్శకాలు రూపొందించింది. ప్రాణం తీసే మందులు ఇవ్వకుండా, కేవలం చికిత్సను నిలిపివేసి సహజ మరణం పొందేలా (పాసివ్ యూథనేషియా) నిబంధనలు తెచ్చింది. ఇందుకు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువుల (నెక్స్ట్ ఫ్రెండ్) అనుమతి తప్పనిసరి అని తేల్చింది. దశాబ్దాలుగా ఆమెను (Aruna Shanbaug) సాకిన కేఈఎం ఆసుపత్రి సిబ్బందిని కోర్టు ‘నెక్స్ట్ ఫ్రెండ్’గా గుర్తించింది. వారు చికిత్స ఆపేందుకు అంగీకరించకపోవడంతో అరుణకు కారుణ్య మరణం దక్కలేదు. చివరికి 2015లో ఆమె న్యుమోనియాతో సహజంగానే కన్నుమూశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హక్కుగా గౌరవప్రదమైన మరణం..
అరుణా షాన్‌బాగ్ (Aruna Shanbaug) కేసు దేశవ్యాప్తంగా తెచ్చిన చర్చతో.. 2018లో సుప్రీంకోర్టు మరోసారి ఈ అంశంపై కీలక తీర్పు వెలువరించింది. ‘గౌరవప్రదంగా మరణించడం’ అనేది పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. నాడు అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన ఆ కఠినమైన మార్గదర్శకాలకు అనుగుణంగానే, నేడు హరీశ్ రాణా కేసులో ప్రాణాధార వ్యవస్థల తొలగింపునకు అనుమతిస్తూ న్యాయస్థానం (Supreme Court) ఈ చారిత్రక తీర్పు వెలువరించింది.
ఇవి కూడా చదవండి








