కోమాలో ఉన్న యువకుడికి కారుణ్య మరణం.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
దాదాపు 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో (కోమా) ఉండి, జీవచ్చవంలా మారిన ఒక యువకుడికి కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత న్యాయ చరిత్రలో ఇటువంటి అనుమతి లభించడం ఇదే తొలిసారి. గౌరవంగా మరణించే హక్కును గుర్తిస్తూ 2018లో ఇచ్చిన ‘కామన్ కాజ్’ తీర్పును ఈ కేసు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం మొదటిసారిగా అమలులోకి తెచ్చింది.
ఘటన నేపథ్యం
గాజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా అనే యువకుడు 2013లో పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండగా, హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తగిలిన తీవ్ర గాయం కారణంగా అప్పటి నుండి అతను కోమాలోనే ఉన్నాడు. 32 ఏళ్ల హరీష్ ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటూ, మంచానికే పరిమితమయ్యాడు. ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో, అతని తల్లిదండ్రులు కుమారుడి బాధను చూడలేక కారుణ్య మరణం కోసం న్యాయపోరాటం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
న్యాయమూర్తుల ఉద్వేగం
జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల నివేదికలు హరీష్ కోలుకునే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ పార్దీవాలా భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. హరీష్ కుటుంబ సభ్యులు చూపిన అపారమైన ప్రేమ, సహనాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా అభినందించింది. హరీష్ రాణాకు అమర్చిన జీవనాధార వ్యవస్థలను తొలగించే ప్రక్రియ అత్యంత మానవీయంగా, అతని గౌరవానికి భంగం కలగకుండా నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యులను కోర్టు ఆదేశించింది.
కీలక పరిణామాలు
కారుణ్య మరణాలపై దేశంలో స్పష్టమైన, ఆచరణాత్మకమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తన కుమారుడు చదువులో టాపర్ అని, 13 ఏళ్లుగా వాడు పడుతున్న నరకం చూడలేకే ఈ పోరాటం చేశామని హరీష్ తండ్రి అశోక్ రాణా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు తన కుమారుడి లాంటి ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.








