మోదీ ‘కుట్ర’ను విపక్షాలు తిప్పికొట్టాయి: మమతా బెనర్జీ
TMC vs BJP: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం కేంద్ర ప్రభుత్వం , పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ చట్టం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడగా, మహిళల ఎదుగుదలకు టీఎంసీ అడ్డంకిగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నిందని..
మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నిందని మమతా బెనర్జీ ఆరోపించారు. స్త్రీలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే విపక్షాలన్నీ ఏకమై కేంద్రం కుతంత్రాలను తిప్పికొట్టాయని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ పతనం పార్లమెంట్లోనే ప్రారంభమైందని, అది బెంగాల్లోనూ కొనసాగుతుందని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే అత్యధిక సంఖ్యలో మహిళా ప్రతినిధులు ఉన్నారని, కేవలం డీలిమిటేషన్ నిబంధన వల్లే తాము ఈ బిల్లును వ్యతిరేకించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు..
మరోవైపు బెంగాల్లోని బంకురాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలు రాజకీయాల్లో ఎదగడం టీఎంసీకి ఇష్టం లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికి టీఎంసీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నాయని ఆరోపించారు. దేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్ల టీఎంసీ నేతల ప్రవర్తన వారి అహంకారానికి నిదర్శనమని, ఇది యావత్ మాతృమూర్తులను అవమానించడమేనని మోదీ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు భాజపా కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో మహిళలు రాణించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీఎంసీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని పిలుపునిచ్చారు.








