ప్రధాని మోదీకి మంత్రివర్గం ‘‘స్టాండింగ్ ఒవేషన్’’…
భారత ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు పదవిలో కొనసాగుతూ చరిత్ర సృష్టించినందుకు నరేంద్ర మోదీ (PM Modi)ని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారంనాడిక్కడ జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ప్రధానమంత్రిని అభినందిస్తూ మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. ప్రధానమంత్రి 4,399 రోజుల సుదీర్ఘ పాలన అభినందనీయమని కొనియాడారు. తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 4,398 రోజులు పదవిలో కొనసాగారు. ఆ రికార్డును ప్రధానమంత్రి మోదీ నేటితో అధిగమించారు.
మరో వైపు తన 12 ఏళ్ల పాలనపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ప్రజా సేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలడు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశ, విదేశీ ప్రముఖులు పలువురు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ 12 ఏళ్ల పాలనను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. వలస పాలకుల హయాంలో ఏర్పడిన న్యూనతను సమర్థవంతంగా ప్రస్తుత ప్రభుత్వం అధిగమించిందంటూ అభినందించారు. కోట్లాది మంది ప్రజలు ప్రేమ, నమ్మకం, ప్రజాదరణతో సుదీర్ఘ పాలన అందించిన క్రెడిట్ ప్రధానమంత్రి మోదికి దక్కుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. సాధికారక, అభ్యుదయం, అభివృద్ధి, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో మోదీ 4,399 రోజుల ప్రయాణం ఒక సువర్ణాధ్యాయమని అన్నారు. మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగించుకున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మన్షుక్ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.








