కేజ్రీవాల్ కి షాక్.. చద్దాతో పాటు మరో ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముందుంది అసలు సినిమా అంటూ రాఘవ్ చద్దా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అన్నట్లే చేసి, కేజ్రీవాల్ కి ఝలక్ ఇచ్చారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం రాఘవ్ చద్దా ప్రకటించారు. అలాగే రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దపు ఆప్ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా రాజీనామా చేసేశారు. అంతేకాకుండా చద్దా మరో బాంబు కూడా పేల్చారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులలో మూడింట రెండొంతుల మంది ఇప్పుడు బీజేపీలో విలీనం అవుతున్నారని కూడా చద్దా ప్రకటించడం కలకలం రేపుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ తాను ఎంతో భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఏ ఆదర్శాలు, మౌలిక విలువల ఆధారరంగా స్థాపించారో, వాటికి పూర్తిగా దూరమైపోయిందని విమర్శించారు. ఇన్ని రోజుల పాటు తప్పుడు పార్టీలో సరైన వ్యక్తి’’ గా వున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపనా సమయంలో ఏవైతే మౌలిక సూత్రాలతో ఏర్పాటైందో, ఇప్పుడు పార్టీ అలా లేదని, తాను ఉక్కిరి బిక్కిరి అవుతున్నానని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది తమకు అండగా నిలిచారని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. వారు తమ మద్దతును తెలియజేస్తూ సంతకాలు కూడా చేశారని వెల్లడించారు. వారిలో తనతో పాటు హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, సందీప్ పాఠక్, విక్రమ్‌జిత్ సాహ్నీ, అశోక్ మిట్టల్ కూడా వున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
‘‘రాజ్యాంగ నిబంధనలను అనుగుణంగా రాజ్యసభలో ఆప్ కి చెందిన మూడింట రెండొంతుల మంది సభ్యులమైన మేము బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం. 15 సంవత్సరాల పాటు నా రక్తం, చెమట ధారబోసి పార్టీ ఎదుగుదలకు కృషి చేశా. కానీ, అది ఏ ఉద్దేశాలతో ఏర్పడిందో వాటికి దూరమైపోయింది. కొన్నేళ్లుగా ఆఇ పార్టీ దేశం కోసం కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. సరైన పార్టీలో వున్నాను అన్న భావన నాకు అనిపించడం లేదు. ఆప్ కి దూరమై, ప్రజలకు దగ్గరవుతున్నా. నేను వారి నేరాల్లో భాగం కావాలని అనుకోవడం లేదు. అందులో భాగం కాలేకపోతున్నాను కాబట్టే వారి స్నేహితాన్ని పొందలేకపోయాను. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. రాజ్యసభలో ఆప్ బలం 10. ఏడుగురం కలిసి వున్నాం. ఈ ఉదయం సంతకాలు చేసిన లేఖలను రాజ్యసభ చైర్మన్ కి కూడా పంపించాం’’ అని ప్రకటించారు.
ప్రస్తుతం రాజ్యసభలో ఆప్ కి 10 మంది ఎంపీలున్నారు. వీరిలో 7 మంది పంజాబ్ నుంచి, ముగ్గురు ఢిల్లీ నుంచి వున్నారు. తాజాగా జరిగిన రాజీనామాతో ఇప్పుడు రాజ్యసభలో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే వున్నారు. వారిలో సంజయ్ సింగ్ (ఢిల్లీ),ఎన్.డి. గుప్తా (ఢిల్లీ),బల్బీర్ సింగ్ సీచేవాల్ (పంజాబ్) వున్నారు.
గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ స్వాతి మాలివాల్ తిరుగుబాటు బావుటాను ఎగరేశారు. ఇప్పుడు రాఘవ్ చద్దా అదే చేస్తున్నారు. దీంతో రాజ్యసభలో కేజ్రీవాల్ బలం సగానికి పైగా తగ్గిపోయింది. ఈ భారీ చీలిక పార్టీ భవిష్యత్తును, సంస్థాగత ఐక్యతకు ఇబ్బంది పెట్టేదే.ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఈ తిరుగుబాటుకు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఢిల్లీలో ఎదురైన ఈ ఎదురుదెబ్బ అనంతరం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సందీప్ పాఠక్‌ను పక్కన పెట్టారు. ఎన్నికల ప్రచార చివరి దశలో, కీలక నిర్ణయాల రూపకల్పన ప్రక్రియల నుండి పాఠక్‌ను పూర్తిగా మినహాయించారు. 2022 నుండి 2024 చివరి వరకు, AAPలో ప్రతి కీలక వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నది పాఠకే.
పార్టీ ఉపనేతగా నియమించిన మిట్టల్ కూడా…
కొద్ది రోజుల క్రితమే రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ ఉపనేత స్థానం నుంచి తొలగిస్తున్నట్లు కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై రాఘవ్ చద్దా అప్పట్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ మిట్టల్ ను ఆ స్థానంలో నియమించారు. అంతగా కేజ్రీవాల్ అశోక్ మిట్టల్ ను నమ్ముకున్నారు. ఆ అశోక్ మిట్టలే ఇప్పుడు చద్దాతో పాటు బీజేపీలోకి వెళ్లిపోయారు. మరోవైపు నియమించిన కొన్ని రోజులకే ఆయన వ్యాపారాలపై ఈడీ దాడులు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న అశోక్ మిట్టల్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. లవ్లీ గ్రూప్ అధిపతిగా ఉన్న మిట్టల్.. ఒక ప్రముఖ యూనివర్సిటీని కూడా నిర్వహిస్తున్నారు. విదేశీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో అధికారులు కీలక పత్రాలను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి








