సమ్మర్లో ఈ బిజినెస్‌లకు తిరగుండదు.. మూడు నెలల కష్టంతోనే రూ.3 లక్షలు మీ సొంతం
వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు సామాన్యుడికి ఎయిర్ కూలర్ ఒక్కటే అందుబాటులో ఉన్న మార్గం. ప్రస్తుతం ఏసీల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెంటు బిల్లుల భయం ఉండటంతో మెజారిటీ ప్రజలు కూలర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటే కేవలం మూడు నెలల్లోనే లక్షలు సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, విద్యార్థులు, చిన్న చిన్న దుకాణదారులు తక్కువ ధరకే లభించే లోకల్ లేదా అసెంబ్లడ్ కూలర్ల కోసం వెతుకుతుంటారు, ఇదే ఈ వ్యాపారానికి ప్రధాన బలం.
ఈ వ్యాపారంలో విజయవంతం కావాలంటే నాణ్యమైన కూలర్లను తక్కువ ధరకు సేకరించడం ముఖ్యం. హైదరాబాద్‌లోని కోఠి, బేగం బజార్ వంటి హోల్‌సేల్ మార్కెట్లలో లేదా నేరుగా తయారీ యూనిట్ల వద్ద కొనుగోలు చేస్తే లాభాల మార్జిన్ పెరుగుతుంది. ఈ వ్యాపారానికి భారీ షోరూమ్‌లు కూడా అవసరం లేదు. జనం రద్దీగా ఉండే మెయిన్ రోడ్ల పక్కన ఒక టెంట్ వేసి లేదా మూడు నెలల పాటు ఒక చిన్న గిడ్డంగిని అద్దెకు తీసుకుని విక్రయాలు ప్రారంభించవచ్చు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి నికర లాభం ఎక్కువగా ఉంటుంది.
లాభాల లెక్కలను గమనిస్తే, ఒక్కో కూలర్ సైజు మోడల్‌ను బట్టి రూ.300 నుండి రూ.500 వరకు లాభం ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో రోజుకు కనీసం 10 కూలర్లు అమ్మినా రోజుకు రూ.3,000 నుండి రూ.5,000 వరకు సంపాదించవచ్చు. ఇలా నెలకు రూ.1 లక్ష చొప్పున ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వ్యాపారం సాగిస్తే సులభంగా రూ.3 లక్షల వరకు లాభం గడించే అవకాశం ఉంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభం ఇచ్చే సీజనల్ వ్యాపారం కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.








