మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నల్లటి డబ్బాలో వస్తోందా? అయితే డేంజరే
తక్కువ ధరకే దొరుకుతున్నాయని నల్లటి రంగులో ఉండే ప్లాస్టిక్ చెంచాలు, ప్లేట్లు వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదకరమైన రసాయనాలను ఆహారంతో పాటు తీసుకుంటున్నట్లేనని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలు సుమారు 80 శాతం ఇలాంటి బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లనే వాడుతున్నాయి. సాధారణంగా టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కినప్పుడు మంటలు రాకుండా ఉండేందుకు వాటి తయారీలో ‘ఫ్లేమ్ రిటార్డెంట్’ అనే శక్తివంతమైన రసాయనాలను ఉపయోగిస్తారు. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడ్డాక వాటిని రీసైక్లింగ్ చేసి ఈ నల్లటి ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తున్నారు.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ నల్లటి ప్లాస్టిక్ చెంచాలు, ఆహార డబ్బాలలో ఆ ప్రమాదకర రసాయనాల అవశేషాలు ఇంకా అలాగే ఉంటున్నాయి. వీటిని వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్లాస్టిక్ వస్తువులను గుర్తించడం చాలా సులభం. నాణ్యమైన ప్లాస్టిక్ వస్తువులు పారదర్శకంగా ఉండి వాటిపై ‘రెజిన్’ గుర్తులు ఉంటాయి. కానీ ఈ బ్లాక్ ప్లాస్టిక్ వస్తువులు నల్లగా, మందంగా ఉండి ఎటువంటి నాణ్యత ముద్రలు లేకుండా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెట్టడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.








