ఇరాన్ చేతికి చిక్కిన ట్రంప్.. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో అమెరికా
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరుపుతున్న దాడులు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా కీలక సైనికాధికారుల మరణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సైనికపరంగా సాధించిన ఈ గెలుపు రాజకీయ లేదా వ్యూహాత్మక విజయంగా మారకపోగా, అమెరికాను ఒక సుదీర్ఘ యుద్ధ ఊబిలోకి నెట్టేలా కనిపిస్తోంది.
ఇరాన్లో తక్షణమే అధికార మార్పు రావాలని ట్రంప్ ఆశిస్తున్నప్పటికీ, అక్కడ మత గురువుల పాలన ఇప్పటికిప్పుడు కూలిపోయే సూచనలు కనిపించడం లేదు. పైగా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ యుద్ధాన్ని భౌగోళికంగా విస్తరించడం ద్వారా అమెరికాపై ఆర్థిక భారాన్ని పెంచాలని టెహ్రాన్ వ్యూహరచన చేస్తోంది. చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టి అమెరికాపై ఒత్తిడి తేవడమే ఇరాన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
చరిత్రకారుడు రాబర్ట్ పపే విశ్లేషణ ప్రకారం అమెరికా ప్రస్తుతం యుద్ధ విస్తరణలో మూడో దశ ఉచ్చు అంచున ఉంది. దాడుల తీవ్రతను పెంచినప్పటికీ ఆశించిన వ్యూహాత్మక ఫలితాలు రాకపోవడమే దీనికి కారణం. మరోవైపు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలకు, అక్కడి ప్రజలకు మధ్య దూరం పెంచేలా ఇరాన్ పావులు కదుపుతోంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తామెందుకు నష్టపోవాలని అరబ్ దేశాల ప్రజలు ప్రశ్నించేలా చేయడం ద్వారా అమెరికాను ఒంటరిని చేయాలని ఇరాన్ భావిస్తోంది. వియత్నాం యుద్ధం తరహాలో ఇది కూడా ఏళ్ల తరబడి కొనసాగితే అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








