గూగుల్, చాట్‌జీపీటీలకు ట్రంప్ షాక్.. 30 రోజులు ప్రభుత్వ చేతుల్లోకి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఒక పెద్ద బాంబు పేల్చారు. నిన్నటి దాకా ఏఐ టెక్నాలజీకి ఎలాంటి బేడీలు వేయకూడదని వాదించిన ట్రంప్ (Donald Trump).. ఇప్పుడు సడన్‌గా టెక్ దిగ్గజాలకు చెమటలు పట్టించేలా ఒక సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై గూగుల్, ఓపెన్ ఏఐ (చాట్‌జీపీటీ), ఆంథ్రోపిక్ లాంటి బడా కంపెనీలు ఏదైనా పవర్ఫుల్ ఏఐ (AI) మోడల్‌ను మార్కెట్లోకి వదలాలంటే.. కచ్చితంగా 30 రోజుల ముందే దాన్ని అమెరికా ప్రభుత్వానికి టెస్టింగ్ కోసం అప్పగించాల్సిందే!
సడన్ యూటర్న్ ఎందుకు?
వాస్తవానికి వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలిరోజే, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన కఠినమైన ఏఐ (AI) పర్యవేక్షణ నిబంధనలను ట్రంప్ (Donald Trump) చెత్తబుట్టలో వేశారు. మరి ఇప్పుడు మళ్లీ కొత్త రూల్స్ ఎందుకు తెచ్చారంటే.. దానికి ప్రధాన కారణం ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘మైథోస్’ (Mythos) అనే ఏఐ మోడల్.
ఇవి కూడా చదవండి
ఇది సాధారణ టెక్నాలజీ కాదు.. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పెద్దాసుపత్రుల కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోని భద్రతా లోపాలను ఇట్టే పసిగట్టేసే బ్రహ్మాస్త్రం. ఇలాంటి శక్తివంతమైన టెక్నాలజీ నేరుగా పబ్లిక్‌లోకి వస్తే, హ్యాకర్ల చేతిలో పడి దేశ జాతీయ భద్రతకే పెనుముప్పు వాటిల్లుతుందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
90 రోజుల నుంచి 30 రోజులకు కుదింపు..
నిజానికి కంపెనీలు తమ ఏఐ (AI) మోడల్స్‌ను 90 రోజుల ముందే ప్రభుత్వానికి ఇవ్వాలని వైట్ హౌస్ మొదట గట్టిగా భావించింది. కానీ అలా చేస్తే ఆవిష్కరణల వేగం తగ్గి తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని టెక్ కంపెనీలు తెచ్చిన ఒత్తిడితో చివరకు ఈ 30 రోజుల రాజీ ఫార్ములాకు ఫిక్స్ అయ్యారు. ఈ నిర్ణయంపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. జాతీయ భద్రతకు, సరికొత్త ఆవిష్కరణలకు మధ్య ఇది కరెక్ట్ బ్యాలెన్స్ అని ప్రశంసించాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ లోపాలను ముందే పసిగట్టి పరిష్కరించేందుకు టెక్ ఇండస్ట్రీ సహకారంతో ఒక ప్రత్యేక ‘ఏఐ సైబర్ సెక్యూరిటీ క్లియరింగ్‌హౌస్’ను కూడా ఏర్పాటు చేయాలని ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం నిర్ణయించింది.
చైనా దాటేస్తుందన్న భయం!
అయితే ట్రంప్ (Donald Trump) తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన సొంత సలహాదారుల నుంచే వ్యతిరేకత వస్తుండటం గమనార్హం. ట్రంప్ ప్రభుత్వ ఏఐ (AI), క్రిప్టో ప్రధాన సలహాదారు డేవిడ్ సాక్స్ ఈ ఉత్తర్వులపై తీవ్రంగా మండిపడ్డారు. భద్రత పేరుతో ఇలాంటి అనవసరపు నియంత్రణలు పెడితే అమెరికాలో టెక్ ఆవిష్కరణలు పడకేస్తాయని ఆయన హెచ్చరించారు. ఇదే అదనుగా ఏఐ రేసులో చైనా తమను సునాయాసంగా వెనక్కి నెట్టేసి గ్లోబల్ లీడర్ అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ ’30 రోజుల’ నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో కాక రేపుతోంది.








