ప్రపంచ వేదికపై తెలుగు వెలుగు.. ‘టైమ్ 100’ జాబితాలో డాక్టర్ కిరణ్ ముసునూరు!
Kiran Musunuru: ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో తెలుగు మూలాలున్న ప్రసిద్ధ వైద్య నిపుణులు కిరణ్ ముసునూరు చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సినీ నటుడు రణబీర్ కపూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులతో పాటు ఆయన పేరు నిలవడం విశేషం.
జెనోమ్ ఎడిటింగ్ ప్రక్రియ..
కార్డియాలజీ (హృద్రోగ చికిత్స) రంగంలో కిరణ్ ముసునూరు చేస్తున్న పరిశోధనలు వైద్య ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జెనోమ్ ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా గుండెపోటును నివారించే టీకాను తయారు చేయవచ్చని ఆయన కనుగొన్నారు. లిపిడ్ జీవక్రియ , హృదయ సంబంధిత జన్యువులపై ఆయన చేసిన విస్తృత అధ్యయనాలు గుండె జబ్బుల ముప్పును తగ్గించే మార్గాలను సుగమం చేశాయి.
హృద్రోగ చికిత్స రంగంలో..
కిరణ్ ముసునూరు తండ్రి డాక్టర్ కోటేశ్వరరావు ముసునూరు కూడా అమెరికాలో ప్రసిద్ధ వైద్య నిపుణులు. 1976లో ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వలస వెళ్ళిన ఆయన బాటలోనే కిరణ్ కూడా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. న్యూయార్క్ నగరంలో జన్మించిన కిరణ్, చిన్నతనం నుండే హృద్రోగ చికిత్సపై ఆసక్తి పెంచుకుని, నేడు ఆ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు.
జన్యు ఎడిటింగ్ ప్రక్రియకు ఆద్యుడిగా..
జన్యు ఎడిటింగ్ ప్రక్రియకు ఆద్యుడిగా పేరుగాంచిన ఆయన, హృద్రోగ చికిత్సకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. గుండెపోటును నివారించేందుకు టీకా అందుబాటులోకి వస్తే, అది కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కిరణ్ ముసునూరు సాధించిన ఈ విజయం తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి








