అమెరికా టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర.. ఏఐ ప్రభావంతో 60 వేల ఉద్యోగాలు ఉఫ్
న్యూయార్క్: అమెరికా టెక్ రంగం 2026 జనవరి నుంచే భారీ ఉద్యోగ కోతలతో అట్టుడుకుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 55,900 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. అంటే సగటున రోజుకు 736 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గతంలో ఆర్థిక మాంద్యం లేదా అధిక నియామకాల వల్ల లేఆఫ్స్ జరిగేవి, కానీ 2026లో జరుగుతున్న మార్పులకు ప్రధాన కారణం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అని స్పష్టమవుతోంది. సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి ఏఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడానికి మానవ వనరులను తగ్గించుకుంటున్నాయి.
అమెజాన్‌లో..
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో 16,000 మందిని తొలగించింది. సుమారు 716.9 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ, మేనేజ్మెంట్ పొరలను తగ్గించి సంస్థను మరింత వేగవంతం (Flattening management layers) చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, జాక్ డోర్సీ నేతృత్వంలోని ‘బ్లాక్’ సంస్థ ఏకంగా 40 శాతం సిబ్బందిని తొలగించింది. గతంలో 10,000 మంది చేసే పనులను ఇప్పుడు AI టూల్స్ సహాయంతో తక్కువ మందితోనే పూర్తి చేయవచ్చని డోర్సీ వెల్లడించడం గమనార్హం. ఇది భవిష్యత్తులో ఇతర కంపెనీలకు కూడా ఒక సంకేతంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి
ఒరాకిల్‌లో..
ఒరాకిల్ సంస్థ 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. AI డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం బ్యాంకుల నుండి రుణాలు లభించడం కష్టతరమవ్వడంతో, సిబ్బంది ఖర్చును తగ్గించి సుమారు 8 నుండి 10 బిలియన్ డాలర్ల నగదును ఆదా చేయాలని కంపెనీ భావిస్తోంది. నగరాల వారీగా చూస్తే, అమెరికాలో సీటెల్ నగరం అత్యధికంగా టెక్ ఉద్యోగాలను కోల్పోగా, ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో నిలుస్తోంది. మెటా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
హైరింగ్ మేనేజర్ల ఉద్యోగాల్లోనూ అదే పరిస్థితి..
తాజా సర్వే ప్రకారం 55 శాతం మంది హైరింగ్ మేనేజర్లు మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 44 శాతం మంది ఏఐ వల్లే ఉద్యోగాలు పోతాయని అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ పాత ఉత్పత్తులను తయారు చేసిన నిపుణులను తొలగిస్తూనే, కొత్త AI టెక్నాలజీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాత్రలు కూడా మారిపోతున్నాయి. కేవలం ఒకే రకమైన నైపుణ్యం కాకుండా, AI టూల్స్‌ను ఉపయోగించి మల్టీ-టాస్కింగ్ చేయగలిగే వారికే భవిష్యత్తులో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అగ్రరాజ్య టెక్ మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో స్పష్టంగా సూచిస్తున్నాయి.








