మోడీ ద యూనివర్సల్ లీడర్..!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ… అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ లీడర్ ఎవరన్నదానిపై అమెరికా రీసెర్చ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఓ సర్వే నిర్వహించింది. మొత్తంగా వారం రోజుల పాటు 24 ప్రజాస్వామ్య దేశాల్లో చేసిన ఈ సర్వేలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. అగ్రరాజ్యాల నేతలను సైతం వెనక్కి నెట్టి మోడీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అత్యంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఆఖరి స్థానానికి పడిపోయారు. అలాగే ట్రంప్ చివరి నుంచి 10వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సర్వే ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ… 70 శాతం అప్రూవల్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని పాపులారిటీని చాటుకున్నారు. అయితే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ లేని నాయకుడిగా ఆయన ఈ జాబితాలో నిలిచారు. దాదాపు 76 శాతం మంది ప్రతివాదులు మెర్జ్ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ కంటే కూడా మెర్జ్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
గతేడాది పదవి చేపట్టినప్పటి నుంచి జర్మనీని గాడిలో పెట్టేందుకు మెర్జ్ ‘సంస్కరణల శరదృతువు’ పేరుతో అనేక వాగ్దానాలు చేశారు. అయితే అవి కార్యరూపం దాల్చకపోవడంతో జర్మన్ ఓటర్లలో ఆయనపై నమ్మకం సడలింది. ఇటీవల ‘ఫోర్సా’, ‘డ్యూచ్ల్యాండ్ట్రెండ్’ నిర్వహించిన సర్వేల్లో కూడా మెర్జ్ పని తీరుపై 84 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే అధికార కూటమి మెజారిటీ సాధించడం కష్టమని ఈ సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
ఈ జాబితాలో మోడీ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 63 శాతం ప్రజాదరణతో రెండో స్థానంలో నిలవగా.. చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ 55 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ 75 శాతం వ్యతిరేకతతో అత్యంత ప్రజాదరణ లేని రెండో నాయకుడిగా నిలిచారు. ఇరాన్‌తో యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్టడుగు నుంచి 10వ స్థానంలో నిలిచి మెర్జ్ కంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. సుమారు 38 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పని తీరును తాము ఆమోదిస్తున్నట్లు తెలిపారు.








