Iran-US War: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం పడే చాన్స్!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు (Iran-US War).. దానికి ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) కల్లోలంగా మారింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక, ఇంధన రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్లో ఇరాన్ ప్రాధాన్యత..
అమెరికా ఎన్ని కఠిన ఆంక్షలు (Iran-US War) విధించినా, ఓపెక్ (OPEC) సభ్య దేశమైన ఇరాన్ ప్రపంచంలోని టాప్-10 చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు నిల్వలు ఇరాన్ సొంతం. ప్రస్తుతం ఆ దేశం రోజుకు సుమారు 3.1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. ఆంక్షలు ఉన్నప్పటికీ సగటున 1.5 మిలియన్ బ్యారెళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తూ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది.
కలవరపెడుతున్న ‘హోర్ముజ్ జలసంధి’..
అంతర్జాతీయ చమురు సరఫరాలో ‘హోర్ముజ్ సముద్ర జలసంధి’ (Strait of Hormuz) అత్యంత కీలకం. ప్రపంచ క్రూడ్ ఆయిల్ వినియోగంలో దాదాపు 20 శాతం ఇంధనం ఈ ఇరుకైన మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న దాడి (Iran-US War) జరిగినా.. రవాణా తక్షణమే స్తంభించి ట్యాంకర్ల ఇన్సూరెన్స్, ఇతర రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. సౌదీ అరేబియా, యూఏఈలకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నా ప్రపంచ డిమాండ్‌ను తీర్చేందుకు అవి ఏమాత్రం సరిపోవని నిపుణులు చెబుతున్నారు.
సెంచరీ దాటనున్న క్రూడ్ ఆయిల్..?
యుద్ధం (Iran-US War) మరింత ముదిరి గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ టెర్మినల్స్, ఇంధన కేంద్రాలపై దాడులు జరిగితే.. మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే అవకాశం ఉంది. ఇరాన్లో వెలికితీత ఖర్చు బ్యారెల్‌కు 10 డాలర్లే కావడంతో ధరల పెరుగుదల ఆ దేశానికి లాభం చేకూర్చవచ్చు. కానీ చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే భారతదేశానికి ఇది అతిపెద్ద ముప్పుగా పరిణమించనుంది. దిగుమతి బిల్లులు పెరిగితే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగి, రవాణా భారం పడి నిత్యావసరాల ధరలు మండిపోతాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంటుంది.








