ప్రపంచానికి ఇంధన ముప్పు.. ఆరు వారాలే గడువు: ఐఈఏ హెచ్చరిక
IEA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. విమాన ఇంధన (Jet Fuel) నిల్వలు ఐరోపా దేశాల్లో ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) వెల్లడించింది. ప్రస్తుతం ఐరోపా వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు మాత్రమే సరిపోతాయని, ఒకవేళ సరఫరా వ్యవస్థ పుంజుకోకపోతే విమాన సర్వీసులను భారీగా రద్దు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.
సంక్షోభానికి ప్రధాన కారణం..
హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో రవాణాకు ఆటంకాలు ఏర్పడటమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ పేర్కొన్నారు. చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల ప్రపంచం మునుపెన్నడూ చూడని రీతిలో ఇంధన కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ మేఘాలు తొలగకపోతే ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన వివరించారు.
సామాన్యుడిపై ధరల భారం..
ఈ పరిణామాలు కేవలం ఇంధనానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని ఐఈఏ అభిప్రాయపడింది. నిరంతరంగా పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ , విద్యుత్ ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని బిరోల్ హెచ్చరించారు. సామాన్యుడిపై ధరల భారం పడటంతో పాటు, దేశాల ఆర్థిక స్థిరత్వం కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








