Pakistan: మళ్లీ… దాయాది కవ్వింపులు.. భారత్ పై దాడి చేస్తామంటూ బాసిత్ అర్ధ రహిత వ్యాఖ్యలు
మూడు సంవత్సరాల పాటు పాక్ హై కమిషనర్ గా భారత్ లో పనిచేసిన అబ్దుల్ బాసిత్ అత్యంత బాధ్యతా రాహిత్యమైన, షాకింగ్ ప్రకటన చేశారు. తాజాగా… మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో భారత్ లో పాకిస్తాన్ హైకమిషనర్ గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ అమెరకా పాక్ పై అణుదాడికి దిగితే, పాక్ భారత్ ను లక్ష్యంగా చేసుకుంటుంది అంటూ అత్యంత ఖండనార్హమైన ప్రకటనను చేశారు. ఒకవేళ ఇరాన్ పరిస్థితి విషమించి, ఇజ్రాయిల్, అమెరికా మన అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేయాలని చూస్తే పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తుందన్నారు. అమెరికా లేదా ఇజ్రాయిల్ పై నేరుగా దాడి చేసే అవకాశం లేకపోతే, తాము ఏమాత్రం వెనకాడకుండా ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలపై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇలాంటి ఆప్షన్ గనక వస్తే.. తాము మాత్రం భారత్ నే లక్ష్యంగా చేసుకుంటామని, ఇదే మా ఆప్ష్ అని అన్నారు.
తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ నుంచి తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లితే మరో ఆలోచనే లేకుండా భారత్ పై దాడులకు దిగుతామంటూ అసందర్భ ప్రేలాపనలు చేశారు. అమెరికా గనక తమపై దాడి చేస్తే గల్ఫ్ లోని ఆ దేశ స్ధావరాలను, ఇజ్రాయిల్ ను లక్ష్యంగా చేసుకోవడం తమకు కష్టతరమని, ఈ క్రమంలో భారత్ ను లక్ష్యంగా చేసుకోవడం తప్ప తమకు మరో మార్గమే లేదన్నారు.
పాశ్చాత్య దేశాల దాడిని నేరుగా ఎదుర్కునే వ్యూహం పాక్ వద్ద లేదనే అంశాన్ని బాసిత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య దేశాలపై పాక్ ప్రతీకార దాడులు చేయలేనప్పుడు చివరిగా భారత్‌ను టార్గెట్ చేయాలన్న వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ చావు దెబ్బతిన్నది. టర్కీ సహాయం తీసుకున్నా… పాక్ భారత్ కి వ్యతిరేకంగా మూడు రోజులు కూడా గట్టిగా నిలబడలేకపోయింది. ఈ నేపథ్యాన్ని మరిచిపోయి, ముంబై మరియు న్యూఢిల్లీలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలదని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ అంటున్నారు.అబ్దుల్ బాసిత్ ఓ విశ్రాంత పాకిస్తానీ దౌత్యవేత్త. 2014 నుంచి 17 వరకు భారత్ లో పాక్ హైకమిషనర్ గా పనిచేశారు. అలాగే పాక్ విదేశాంగ శాఖలో చాలా కాలం పనిచేశారు కూడా.








