Davos: దావోస్‌లో రెండు రాష్ట్రాల హవా
దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా తమ పాలసీలతో, చర్చలతో విజయవంతమయ్యాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వివరిస్తే, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా ప్రసంగించి ఆకట్టుకున్నారు. దేశంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దావోస్ పర్యటనను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుని పెట్టుబడులను రాబట్టుకోవడానికి కషి చేశారు. ఇందులో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలతోపాటు, ఇతర దేశాల ప్రతినిధులతోనూ చర్చించారు. ఈ చర్చల ఫలితంగా వచ్చిన పెట్టుబడుల హామీలు, ఒప్పందాలు ఉద్యోగాల సృష్టి, పారిశ్రామిక అభివృద్ధి, టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకువస్తాయని అధికారులు అంటున్నారు. ఈసారి దావోస్ సదస్సు తెలుగు రాష్ట్రాల లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడిందని చెప్పవచ్చు.
రాష్ట్రం ప్రగతి సాధించాలంటే పెట్టుబడులు అవసరం. పెట్టుబడుల కారణంగా ఏర్పాటయ్యే కంపెనీల వల్ల, ఫ్యాక్టరీల వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రజలు మెరుగ్గా జీవనాన్ని సాధించే అవకాశం కలుగుతుంది. అందుకోసమే ప్రభుత్వ పెద్దలు ఇన్వెస్టర్ల విషయంలో వారికి నచ్చేలా పాలసీలను రూపొందించి పెట్టుబడులను తీసుకువస్తుంటారు. ఇన్వెస్టర్లకు అవసరమైన అన్నీ వసతులను కూడా కల్పించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా లైసెన్సులు ఇవ్వాలి. ఇవన్నీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు త్వరితగతిన చేస్తుండటంతో పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాలకూ పెట్టుబడులు బాగా వస్తున్నాయి. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు టీమ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్.. మంచి ఫలితాలు సాధించాయి. రెండు టీమ్‌లు తమ రాష్ట్రాలకు పెట్టుబడులను తీసుకువచ్చాయి. రెండు రాష్ట్రాలకూ భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. అవగాహనా ఒప్పందాలు కూడా బాగా జరిగాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే వేదికపై సమావేశమై, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకారం ఇచ్చిపుచ్చుకునే అంశాలపై కూడా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌కు లభించిన పెట్టుబడులు
దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన జరిపిన పర్యటన దిగ్విజయంగా ముగిసింది. నాలుగురోజులపాటు సాగిన ఈ సదస్సులో ఏపీ బృందం చర్చలకే పరిమితంకాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మార్చే భారీ పెట్టుబడులను ఖరారు చేసుకుంది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం ఈ పర్యటనలో కుదరడం విశేషం. ఆరఎంజడ్ గ్రూప్‌తో భారీ భాగస్వామ్యం కుదిరింది. ఈ డీల్ వల్ల సుమారు రూ.84,000 కోట్లు పెట్టుబడి ఎపికి రాబోతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో డిజిటల్ హబ్ ఏర్పాటు కానున్నది. మెగా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్, హైపర్ స్కేల్ డేటా సెంటర్, సిసి పార్క్ నిర్మాణం జరగబోతోంది. కోటి చదరపు అడుగుల్లో నిర్మాణాలు రానున్నాయి. సుమారు లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా ఉంది. ఇజ్రాయిల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. యుఎఇ సహకారంతో ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలు న్నాయి. ఏపీ ప్రభుత్వం రూ.2.36 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురానున్నది. వాటి ద్వారా 1.33 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయనే అంచనా ఉంది. ఏపీ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడంలో ఈ పర్యటన బాగానే ఉపయోగపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే 2025లో దావోస్‌లో కుదిరిన రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఇప్పుడు వచ్చే దశలో ఉన్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన టీమ్ ఈ పర్యటనను బాగానే సద్వినియోగం చేసుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్ తోపాటు హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరంలో పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలను బాగా వివరించడంతో చాలా సంస్థలు పెట్టుబడులను పెట్టేందుకు రెడీ అయ్యాయి. చాలా దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌లో ఆఫీసులు, కంపెనీలు ఉన్నందు వల్ల ఆ సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ‘తెలంగాణ రైజింగ’ టీమ్.. 3 రోజులు దావోస్‌లో ఉండి.. కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం సుమారు 30,000 కోట్లకు పైగా పెట్టుబడి హామీలు లభించాయి. రష్మి గ్రూప్ రూ.12,500 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్‌ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది. ఇందువల్ల సుమారు 12,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ రూ.623 కోట్లతో గాగిల్లాపూర్, శంషాబాద్‌లో యూనిట్లను విస్తరించనున్నది. ఎనర్జీ ఎఫిషియెన్సీ, గ్రిడ్ మోడర్నైజేషన్ రంగాల్లో సహకారం అందించ నున్నది. పియర్సన్ కంపెనీ ఎఐ ఇన్నోవేషన్ హబ్ కింద గ్లోబల్ ఎఐ అకాడమీకి ఎఐ స్కిల్లింగ్, కరికులమ్ సపోర్ట్ చెయ్యడానికి ముందు కొచ్చింది. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఎఐ కో లాబ్ సంస్థ.. తెలంగాణలో హెల్త్ కేర్ రంగంలో ఎఐ అప్లైడ్ రీసెర్చ్, ట్రైనింగ్ సహకారం అందించేందుకు ఆసక్తి చూపింది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ స్టార్టప్‌లకు మార్కెట్ యాక్సెస్, ఈవెంట్లకు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. బ్లైజ్ సంస్థ.. హైదరాబాద్‌లో ఆరఅండ్డి సెంటర్‌ని విస్తరించేందుకూ, ఎఐ హార్డ్ వేర్ అండ్ సాఫ్ట్ వేర్ రంగాన్ని డెవలప్ చేసేందుకు ఆసక్తి చూపించింది. మొత్తంగా ఈ పర్యటనతో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్‌కు గ్లోబల్ సపోర్ట్ బలపడింది. రాష్ట్రాన్ని ఎఐ రాజధానిగా మార్చేలా కీలక అడుగులు ఈ పర్యటనతో మరింతబలపడ్డాయి.








