నాగ్‌పూర్‌లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఏప్రిల్‌ 26 నుంచి

నాగ్‌పూర్‌లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఏప్రిల్‌ 26 నుంచి

02-04-2019

నాగ్‌పూర్‌లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఏప్రిల్‌ 26 నుంచి

నాగ్‌పూర్‌లో ఉన్న ఆంధ్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు కమ్యూనిటీకోసం పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఉన్న చిన్నారులకోసం 'పాఠశాల' సంస్థ ద్వారా తెలుగు పలుకులను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర చోట్ల ఉన్న తెలుగువారిని ఇక్కడకు రప్పించి వారిచేత ప్రదర్శనలను, ఉపన్యాసాలను ఆంధ్ర అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మశ్రీ డా చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నార్త్‌అంబజారి రోడ్డులో ఉన్న అమృత్‌భవన్‌లోని నాగ్‌పూర్‌ ఆంధ్ర అసోసియేషన్‌ కార్యాలయంలో ఈ ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర వైభవంపై చాగంటిగారు ప్రవచనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌. మురళీధర్‌, కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, సంయుక్త కార్యదర్శి పి.టి శర్మ, కోశాధికారి జెవి రావు కోరారు.

చాగంటి కోటేశ్వరరావుకు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉన్న పేరును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచారాన్ని నాగ్‌పూర్‌లోనే కాకుండా చుటుపక్కల ఉన్న పట్టణాల్లో ఇతర చోట్ల తెలుగువారు నివసించే ప్రాంతాల్లో కూడా చేసినట్లు కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు ఇప్పటికే తన ప్రవచనాల ద్వారా ఎంతోమందిని భక్తిమార్గంవైపు పయనింపజేశారని, అదేసమయంలో మంచి ఆలోచనలు కలిగించేలా మంచి మాటలు చెబుతూ దేశంలో ధర్మపరిరక్షణకు కృషి చేస్తున్నారని పిఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. అలాంటి మహానుభావుడి ప్రవచనం వినేందుకు ఎంతోమంది తహతహలాడుతుంటారని దీనిని దృష్టిలో పెట్టుకునే తెలుగువారు ప్రయాణించే రైళ్ళలోనూ, అలాగే నాగ్‌పూర్‌, ఇట్వారి, అజ్ని, భందారా, గోండియా, దుర్గ్‌, భిలాయ్‌ సిటీ, భిలాయ్‌ పవర్‌హౌజ్‌, రాయ్‌ పూర్‌ వంటి స్టేషన్‌ల ప్లాట్‌ఫారంలో కూడా పోస్టర్లను అతికించినట్లు చెప్పారు.  నాగ్‌పూర్‌లో ఉన్న అన్నీ దేవాలయాల్లోనూ ప్రచారం చేసినట్లు కూడా మూర్తి తెలిపారు. రామ్‌నగర్‌ రామ్‌ మందిర్‌, శ్రీ సర్వేశ్వరాలయ్‌ టెంపుల్‌, బాలాజీ మందిర్‌, శంకర్‌ నగర్‌ శ్రీ రాఘవేంద్ర, బాలాజీ టెంపుల్‌, టేకిడి గణేష్‌ మందిర్‌ వంటి పలు దేవాలయాల్లో పోస్టర్ల ద్వారా ప్రచారం చేశామన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో, ఇతర వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కూడా చాగంటి కార్యక్రమంపై ప్రచారం చేసినట్లు మూర్తి వివరించారు.

వివిధ చోట్ల, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భక్తులంతా ఈ ప్రవచన కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని కోరుకుంటున్నట్లు మూర్తి చెప్పారు.