ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న 'హాయ్ నాన్న'

రివ్యూ : ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న 'హాయ్ నాన్న'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా తదితరులు
సినిమాటోగ్రాఫ్ : సాను జాన్ వరుగుస్ ISC, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని
కాస్ట్యూమ్ డిజైనర్ : శీతల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ
నిర్మాతలు : మోహన్ చెరుకూరి (CVM) డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
దర్శకత్వం : శౌర్యువ్
విడుదల తేదీ : 07.12.2023

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని చేసిన మూవీ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:

ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ లైఫ్ సర్కిల్ నలిగిపోయిన విరాజ్ (నాని) ముంబై‌లో ఫేమస్ ఫొటోగ్రాఫర్. అతనికి ఆరేళ్ల కూతురు మహి (బేబీ కియారా ఖన్నా) అంటే పంచ ప్రాణాలు. మహి పుట్టుకతోనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తుంటాడు విరాజ్. మహిని నిద్రపుచ్చేప్పుడు కథలు చెప్తుంటాడు విరాజ్. అయితే అమ్మలేని కథలే చెప్తుండటంతో.. నాకు అమ్మ ఉన్న కథే చెప్పమని మొండికేస్తుంది మహి. అమ్మ కథ చెప్తే మహి తట్టుకోలేదని.. చెప్పడానికి ఇష్టపడడు విరాజ్. దీంతో మహి ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రమాదం బారిన పడటంతో యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. విరాజ్‌కి ఫోన్ చేసి మహిని అప్పగిస్తుంది. ఆ సందర్భంలో విరాజ్.. మహికి తన గతంలో ఉన్న అమ్మ కథని చెప్పాల్సి వస్తుంది. ఆ కథలో అమ్మ.. వర్ష (ఎవరనేది సస్పెన్స్) అయితే.. ప్రజెంట్ అమ్మగా యష్ణను ఊహించుకుని విరాజ్ చెప్పిన కథ వింటుంది మహి. అయితే విరాజ్ చెప్పిన కథలో.. ధనవంతురాలైన వర్షని విరాజ్ తొలి చూపులో ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. కూతుర్ని కనడం.. ఆ తరువాత వర్షకి యాక్సిడెంట్ అవ్వడం.. భర్త, కూతుర్ని వదిలేసి ఆమె వెళ్లిపోవడంతోనే కథని ఆపేస్తాడు. ఆ తరువాత ఏమైంది? అసలు వర్ష ఎవరు? యష్ణ ఎవరు? విరాజ్‌తో ఎందుకు విడిపోయింది? పాపని ఎందుకు వదిలేసింది? ఆ పాప కారణంగా విరాజ్, వర్షల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ‘హాయ్ నాన్న’ మిగతా కథ.

నటీనటుల హావభావాలు :

విరాజ్ పాత్రలో నాని చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్ లో ఓ సగటు తండ్రిగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. నాని మెయిన్ గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో మరియు కూతురితో ‘నీకు నా ప్రేమ సరిపోవడం లేదా’ అని సీన్స్ లో నాని నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నానికి, మృణాల్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయకగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మృణాల్‌ పాత్ర ప్రభావం ద్వారా కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అతిధి పాత్రలో శృతి హాసన్‌, అలాగే తండ్రిగా జయరామ్‌ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండ్ రోల్‌లో ప్రియదర్శికి మంచి పాత్రే దక్కింది. అయితే ఈ సినిమాలో కామెడీకిపెద్దగా స్కోప్‌లేదు కాబట్టి.. తన పాత్రకి న్యాయం చేశాడు ప్రియదర్శి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ ఉంది. ఉందంటే ఉందంతే.. మెరుపుతీగలా ఓ సీన్‌లో అలా కనిపించి మాయం అవుతుంది. ఇంకో సాంగ్‌లో కనిపిస్తుంది. హీరోయిన్‌కి ప్రియుడిగా.. డాక్టర్‌గా బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. విరాజ్ అశ్విన్ (బేబీ ఫేమ్) ఉన్నాడు కానీ.. అతని పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ సీన్‌లో మాత్రమే అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్‌లకు ఒక బలమైన సీన్ పడింది. అంగద్‌ బేడీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేసిన శౌర్యువ్‌కి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు నాని. ఎంట్రీలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడానికి శౌర్యువ్‌‌కి ‘హాయ్ నాన్న’ మంచి వేదిక అయ్యిందని చెప్పొచ్చు. ఈ కొత్త దర్శకుడు కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. కథను మొదలు పెట్టిన విధానం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ వరకూ కాలయాపన చేయకుండా ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీకి వచ్చాం అనే ఫీల్‌ని కలిగించారు. అసభ్యతకి తావు ఇవ్వకుండా, అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. షను వర్గీస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

అమ్మ గురించి ‘నాన్న’ నానీ చెప్పిన ఈ ప్రేమకథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సున్నితమైన భావోద్వేగ కథలెప్పుడూ అందులో కనిపించే పాత్రలపైనే నిలబడతాయి. ఈ సినిమాలో విరాజ్, యష్ణ, మహి పాత్రలే కథకి కోర్ స్ట్రెంత్. ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. గొడవలు.. విడిపోవడాలు.. ‘హాయ్ నాన్న’ కథాంశం కొత్తదేమీ కాదు. జెర్సీ, సంతోషం, ఖుషీ ఇలా చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. కానీ ‘హాయ్ నాన్న’లో అమ్మ పాత్రని దర్శకుడు శౌర్యువ్ మలిచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌కి పెద్ద పీఠ వేస్తూనే.. అమ్మకథలో మలుపుల్ని హృద్యంగా చూపించారు. ఓ ‘ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా’గా వచ్చిన ఈ హాయ్ నాన్న చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. గుడ్ కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే ఫాదర్, డాటర్ ఎమోషన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, నాని, మృణాల్ తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ‘హాయ్ నాన్న’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తుంది అని చెప్పొచ్చు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :