ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వెబ్‌ సిరీస్‌ రివ్యూ : సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దూత'

వెబ్‌ సిరీస్‌ రివ్యూ : సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దూత'

తెలుగు టైమ్స్.నెట్  రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ 
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎపిసోడ్స్‌: 8
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు
ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల, సంగీతం: ఇషాన్ చబ్రా
మాటలు: వెంకటేష్ దొండపాటి, నిర్మాత: శరత్ మరార్
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
స్ట్రీమింగ్ మొదలైన తేదీ: 01.12.2023

యువ హీరో అక్కినేని వారసుడు నాగ చైతన్య తొలిసారిగా ఓటిటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన తొలి  వెబ్ సిరీస్ “దూత”  డిసెంబర్ 1 తేదీన పెద్ద గా హడావిడి లేకుండానే  అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది. '13బి', ఇష్క్ , 'మనం' లాంటి అవార్డుల, రివార్డ్ లు  ఇచ్చిన సినిమా డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకొన్న విక్రమ్ కే కుమార్ డైరెక్టర్ గా, అక్కినేని నాగ చైతన్య హీరో గా 8 ఎపిసోడ్స్ తో వచ్చిన 'దూత' ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది సమీక్షలో చూద్దాం.

కథ ఎలా ఉందంటే?...

సాగర్ (నాగ చైతన్య) నైతికత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రిక చీఫ్ ఎడిటర్. ఓ రోజు ఇంటికి వెళుతూ ఉండగా... ధూమ్ ధామ్ ధాబా దగ్గర కారు ఆగుతుంది. ధాబాలోకి వెళ్లిన సాగర్కు  ఓ పేపర్ కటింగ్ కంట పడుతుంది ! అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి... పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి.  ఆ పేపర్ కటింగ్స్ లో వున్న న్యూస్ ప్రకారం వెంట వెంటనే హత్యలు, ఆత్మ హత్యలు జరుగుతూ వుంటాయి. ఆ హత్యలు - ఆత్మ హత్యలు లేదా ఆ సంఘటనలు ముందుగానే ఒక న్యూస్ పేపర్ కటింగ్స్ లో వుండటం వాటిలో రాసినట్టు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏమిటి? జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పేపర్లలో రాస్తున్నది ఎవరు?

మొదటి ఎపిసోడ్ లోనే సాగర్ నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య చేసుకొనే ప్రయత్నంలో భార్య ప్రియ ( ప్రియ భవాని శంకర్ )కి సెల్ ఫోన్ నుంచి మెసేజ్ ఇద్దామని ఆనుకోవటం, సెల్ లో ఛార్జ్ అయిపోతే కంగారు గా ఫోన్ ఛార్జర్ వెతుకుతూ కొన్ని డాక్యుమెంట్స్ చూడటం, వెంటనే ఆత్మ హత్య చేసుకోకూడదని, బ్రతకాలని ప్రయత్నం చేసే ఉత్కంట భరిత సన్నివేశం ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో చెపుతుంది. సాగర్ వర్మ చేసిన పాపం ఏమిటి? అతని ప్రయాణంలో భార్య ప్రియా, పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), పోలీస్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్) పాత్రలు ఏమిటి? సాగర్ వర్మ కథకు... కొన్నేళ్లుగా జరుగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలకు... స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్యాజ్యం వచ్చిన తర్వాత 'దూత' పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసును ఎస్పీ క్రాంతి షినోయ్ (పార్వతి తిరువొతు) ఎలా సాల్వ్ చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

నటీనటుల హావభావాలు:

నాగ చైతన్యది పాజిటివ్ రోల్ అని చెప్పలేం. అలా అని నెగిటివ్ రోల్ కూడా కాదు. అవసరాన్ని బట్టి మారుతూ ముందుకు వెళుతుంది. గ్రే షేడ్స్ ఉన్నాయి. యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది. లుక్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకు చైతన్య ఇంప్రెస్ చేస్తారు. చైతన్య తర్వాత ఎక్కువగా ఆకట్టుకునేది ఎస్పీ క్రాంతిగా పార్వతి తిరువొతు నటన. ఎంతో  సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య గరికపాటి, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు సిరీస్ లో తమ పాత్రలమేరకు కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ నటించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతికంగా 'దూత' ఉన్నత స్థాయిలో ఉంది.  విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే... ఓ చిన్న పాయింట్ తీసుకుని 13బి, ఇష్క్ వంటి సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టారు. 13బి లో భయపెట్టే ప్రయత్నం,  ఇష్క్ లో  ప్రేమకథను ఫీలయ్యేలా చేశారు. 'మనం' వంటి సంక్లిష్టమైన స్క్రీన్ ప్లేను చక్కగా అందరికి అర్థం అయ్యేలా చెప్పారు. మూడు  భిన్నమైన కథలు. కానీ, వాటిని తీసిన దర్శకుడు ఒక్కరే. ఆ అనుభవం అంతా 'దూత' దర్శకత్వంలో కనిపించింది. 'దూత' కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్ తర్వాత గానీ క్లారిటీ రాదు. అసలు, అప్పటి వరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని వీక్షకులకు విక్రమ్ కె కుమార్ ఇవ్వలేదు. ఏదో ఒక మేజిక్ చేస్తూ ముందుకు వెళ్లారు. మొదటి ఎపిసోడ్ మొదలైన కాసేపటికి కథలోకి వెళ్లారు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చే వరకు ఉత్కంఠ కంటిన్యూ చేశారు.

'దూత'లో దెయ్యం లేదు. కానీ, కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. రెగ్యులర్ హారర్ నేపథ్య సంగీతంతో భయపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, కంటికి కనిపించని పాత్రను ఫీలయ్యేలా చేశారు. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిలింగ్ సామాన్య ప్రేక్షకులు సైతం గమనించేలా ఉంటుంది. వర్షంలో సన్నివేశాలు బాగా తీశారు. కథనం మొత్తం  గ్రిప్పింగ్ గా వుంచటం లో దర్శకుడు విక్రమ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అనుకోవాలా ? లేదా హార్రర్ స్టోరీ అనుకోవాలా?? అంటే రెండూ  కలిసిన స్టోరీ అని, 8 ఎపిసోడ్ లు మొత్తం చూసే వరకు ప్రేక్షకుడు ఆగలేడు అని చెప్పొచ్చు. ఇషాన్ చబ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. కెమరామెన్  మికొలాజ్ సైగుల ప్రతి ఫ్రెమ్ విజువల్స్ హాలీవుడ్ లెవల్లో వున్నాయి. నిర్మాత శరత్ మరార్ నిర్మాణపు విలువలు బాగున్నాయి.  

విశ్లేషణ :

'దూత' కథ ఏమిటనేది  చివరివరకు ఉత్కంఠగానే ఉంటుంది. ఐదారు ఎపిసోడ్లు చూసే వరకు కథ అర్ధం అవ్వదు. కానీ ఎక్కడికక్కడ సస్పెన్స్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. పరుగు మొదలైన తర్వాత ఏదో ఒక సమయానికి మనకు అలసట వస్తుంది. నడక సైతం నెమ్మదిస్తుంది. ప్రతి కథలోనూ, ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలలో ఆ నెమ్మది ఉంటుంది. 'దూత'కు అటువంటి అలసట ఫ్లాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అది కొత్తగా లేదు. అప్పటి వరకు కొత్తగా ముందుకు వెళ్లిన కథను సగటు రివేంజ్ ఫార్ములా రూటులోకి తీసుకు వెళ్ళింది. కానీ, కథను ముందుకు తీసుకు వెళ్ళడానికి దర్శకుడికి ఫ్లాష్ బ్యాక్ తీయక తప్పలేదు. పీఏతో ఎడిటర్ ఎఫైర్ ఎపిసోడ్, ఎండింగ్ కాస్త సాగదీత వ్యవహారమే. కాలంతో పాటు వారసులను కర్మ వెంటాడుతోందని అంతర్లీనంగా చిన్న లేయర్ కూడా ఉంది. 'మురారి' చిత్రం  తరహాలో....  విక్రమ్ తీసిన '13బి' ఛాయలు 'దూత'లో కూడా కనిపిస్తాయి. క్యారెక్టర్లను కనెక్ట్ చేసిన విధానం కాస్త సినిమాటిక్ టైపులో ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల మధ్య ఉండటం కూడా కాస్త మైనస్ అని చెప్పాలి. ఓటీటీ అంటే రెండు మూడు బూతులు ఉండాలన్నట్లు... అవసరం లేకపోయినా స్పేస్ తీసుకుని మరీ కొన్ని చోట్ల చైతూ నోటితో 'లం...', 'ఫ...' వర్డ్స్ పలికించారు.  

మీడియాలో అవినీతి అనేది  కొత్త కాదు. దానిని ప్రధానాంశంగా తీసుకున్న విక్రమ్ కె కుమార్... క్లాస్ పీకలేదు. కానీ, అంతర్లీనంగా అవినీతి తగదని సందేశం ఇచ్చారు. మీడియాను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకుంటున్న వైనాన్ని, జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును చక్కగా చూపించారు. ప్రస్తుత సమాజంలో కొన్ని పత్రికలు, ఛానళ్లపై చిన్నపాటి సెటైర్ వేశారు. జర్నలిజం, రాజకీయం, పోలీస్ వ్యవస్థ... మూడు రంగాల్లో మంచి, చెడులను విక్రమ్ కె కుమార్ చూపించారు. ఈ  సిరీస్ కథ కొత్తది కాదు. కానీ, సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ కంటిన్యూ అవుతూ ముందుకు వెళుతుంది. నాగ చైతన్య నటన, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం ఆకట్టుకుంటాయి. నిడివి కాస్త ఎక్కువే. కానీ, థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ లు చూసే జనాలకు ఇదొక ఆప్షన్. డీసెంట్ సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్  నైట్ టైం చూస్తే థ్రిల్ గా ఉంటుంది.

రివ్యూ బై : సి. వి.సుబ్బా రావు, ఎడిటర్ 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :