ASBL NSL Infratech

రివ్యూ : అధర్మానికి అడ్డుగా నిలిచిన నేటి ‘సైంధవ్‌’

రివ్యూ : అధర్మానికి అడ్డుగా నిలిచిన నేటి ‘సైంధవ్‌’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ,
ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరులు
సినిమాటోగ్రఫీ : యస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
నిర్మాత: వెంకట్ బోయనపల్లి, రచన, దర్శకత్వం:  శైలేష్ కొలను
విడుదల తేదీ : 13.01.2024
నిడివి : 2 ఘంటల 18 నిముషాలు  

విక్టరీ వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘సైంధవ్‌’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన  మెయిన్ థీమ్. 'సైంధవ్'....  ముందుగా ఈ నెగటివ్ టైటిల్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా కార్యక్రమం లో అడ్డుతగిలితే "ఏంట్రా? సైంధవుడిలా అడ్డు పడుతున్నావ్?" అంటుంటారు. ఇతిహాసాల్లోకి వెళితే.... మహాభారత యుద్ధం లో అర్జునుడిని మినహాయించి మిగిలిన నలుగురు పాండవులను ఒక్కరోజు పాటు అడ్డుకున్నవాడు సైంధవుడు. ఇలా పాండవులను నిలువరించి పద్మవ్యూహంలో అభిమన్యుడి చనిపోయేలా చేశాడు సైంధవుడు. సింపుల్‌గా చెప్పాలంటే ధర్మానికి అడ్డు నిలిచినవాడే సైంధవుడు. అయితే ఇక్కడ ఈ  'సైంధవ్' మాత్రం అధర్మానికి అడ్డుగా నిలిచాడు. మరి ఈ రోజే విడుదల అయిన ఈ  'సైంధవ్' వెంకీ మామ అధర్మాన్ని ఎలా అడ్డుకున్నాడో? 75వ రికార్డ్ సినిమాని శైలేశ్ ఎలా తీశాడు? సంక్రాంతి బరిలోకి దిగిన సైంధవ్ హిట్ కొట్టాడో లేదో సమీక్షా లో చూద్దాం.

కథ:

సౌత్ ఇండియాలో చంద్రప్రస్థ అనే కల్పిత నగరంలో పెద్ద కార్టెల్‌ను రన్ చేస్తూ ఉంటుంది ఓ బ్యాచ్. కార్టెల్ అంటే.... అమాయకులైన యువతని, వయలెంట్ గేమ్స్‌కి (పబ్‌జీ) బానిసలైన యూత్‌కి శిక్షణ ఇచ్చి, గన్స్ ఎలా వాడాలో నేర్పించి, ఉగ్రవాదసంస్థలకు సప్లయి చేయడమే వీరి లక్ష్యం అన్నమాట. ఇక దీనికి మిత్ర (ముకేష్ రిషి) లీడర్. మిత్ర 3 వేల మంది కుర్రాళ్లని ట్రైన్ చేసి గన్స్‌తో ఉగ్రవాదులకి చేర్చే బాధ్యతను కార్టెల్ మెంబర్ వికాశ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి అప్పగిస్తాడు.  అయితే వీళ్ల చేతికి రావాల్సిన ఆయుధాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తారు. మరోవైపు పోర్ట్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తూ తన కూతురే (బేబీ సారా) సర్వస్వం అనుకుంటూ బతుకుతుంటాడు సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్).

పాపను జాగ్రత్తగా చూసుకుంటూ సైంధవ్‌ని ప్రేమిస్తుంటుంది మనో (శ్రద్ధా శ్రీనాథ్). అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో తన కూతురికి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని సైంధవ్‌కి తెలుస్తుంది. దీని నుంచి పాపని కాపాడాలంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని విలువ రూ.17 కోట్లు అని తెలిసి తల్లడిల్లిపోతాడు సైంధవ్. ఈ ఆరోగ్య సమస్యతో బాధ పడే పిల్లలు ఆ సిటీలో 300కి పైగా ఉన్నారని అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ చెబుతుంది డాక్టర్ రేణు (రుహానీ శర్మ). ఇలాంటి తరుణంలో సైంధవ్‌కి కార్టెల్ గ్యాంగ్‌కి మధ్య గొడవ జరుగుతుంది. సైంధవ్‌ని చూసి సైకో అంటూ వాళ్లంతా గజగజ వణకిపోతారు. అసలు ఈ సైకో ఎవరు? సైంధవ్ గతం ఏంటి? మరి తన పాపతో పాటు మిగిలిన చిన్నారుల ప్రాణాలను సైంధవ్ కాపాడాడా? కుర్రాళ్ల చేతికి తుపాకులు ఇచ్చి బీభత్సం సృష్టించాలనుకుంటున్న వాళ్లని సైంధవ్ అడ్డుకున్నాడా? అనేది మిగతా కథ.

నటీనటుల హావభావాలు :

ఇక సినిమాలో వెంకీ యాక్టింగ్ గురించి వేరే చెప్పాలా? సహజంగా ఎమోషనల్ సీన్లతో ఏడిపించడం వెంకీకి కొత్తేం కాదు. కానీ ఇందులో కొన్ని సీన్లలో వెంకటేష్‌ని చూసినప్పుడు ఆడియన్స్‌కి తెలీకుండానే గుండె బరువెక్కిపోతుంది. ముఖ్యంగా తన కూతురిని కాపాడుకోలేకపోతున్నాననే బాధ గుండెను కోసేస్తున్నా నవ్వుతూనే తన పాపతో మాట్లాడే సీన్ వేరే లెవల్‌లో ఉంది. తన నుంచి ఏం కోరుకుంటారో అది నూటికి నూరు శాతం ప్రేక్షకుడికి ఇచ్చారు వెంకటేష్. యాంగ్రి మ్యాన్‌గా కనిపిస్తూనే తల్లడిల్లిపోయే తండ్రిగానూ ఒదిగిపోయారు. ఇక సినిమాలో మరో హైలెట్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన. బాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీకి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక దీనికి ఆయనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవాజుద్దీన్ సిద్ధిఖీ బాగా ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ కానీ ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా భయపెట్టడం కానీ ఇలా ప్రతి సీన్‌లోనూ తన యాక్టింగ్ టాలెంట్ చూపించారు.

ఇక సినిమాలో కామెడీ బాధ్యతను కూడా ఆయనే చూసుకున్నారు. ఎవరినైనా తిట్టేటప్పుడు (బెన్ స్ట్రోక్స్) అంటూ క్రికెటర్‌ పేరును వాడేశారు. ఇక మనో పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ సరిగ్గా సరిపోయింది. వెంకటేష్‌, పాపతో ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. డాక్టర్ పాత్రలో ఉన్నంత పరిధిలోనే రుహానీ కూడా పాత్రకు న్యాయం చేసింది. ఇక వెంకీ ఫ్రెండ్ మానస్ పాత్రలో తమిళ హీరో ఆర్య కనిపించారు. రెండు మూడు ఫైట్ సీన్లు మాత్రమే ఆర్యకి ఉన్నాయి. ఇక నవాజుద్దీన్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ క్యారెక్టర్‌లో ఆండ్రియా చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఇక వెంకటేష్ కూతురు గాయత్రిగా నటించిన బేబీ సారా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్నారి యాక్టింగ్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.

సాంకేతిక వర్గం పనితీరు :

డైరెక్టర్ శైలేశ్‌కి ఉన్న ప్రత్యేకత తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్‌తో ఆకట్టుకుంటాడు. ఇదే ఫార్ములాను హిట్, హిట్-2కి వాడి సూపర్ హిట్లు అందుకున్నాడు. సరిగ్గా సైంధవ్‌కి కూడా ఇదే ఫార్ములాను ట్రై చేశాడు. స్టోరీ అంతా మనకి తెలిసినా దాన్ని చూపించే విధానంతో కాస్త ఇంప్రెస్ చేశాడు. సినిమా మొత్తం హై యాక్షన్ సీన్లు చేయిస్తూనే వెంకీ మార్క్ ఎమోషన్, సెంటిమెంట్‌ను బయటికి తీశాడు. టెక్నీకల్ గా చుస్తే  సినిమాటోగ్రాఫేర్  యస్.మణికందన్ కు వంద మార్కులు వెయ్యొచ్చు. చంద్రప్రస్థ అనే కల్పిత నగరాన్ని చూపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

‘విక్ర‌మ్‌’ 'జైలర్' చిత్రాల ప్ర‌భావం ఈ సినిమాపై క‌నిపిస్తుంది. విక్ర‌మ్ స్టైల్ లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేద్దామ‌నుకొన్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌గా విక్ర‌మ్ సాదా సీదాగానే ఉంటుంది. కానీ అందులో హై మూమెంట్స్ క‌నిపిస్తాయి. `సైంధ‌వ్‌`లో అదే పెద్ద లోటుగా కనిపిస్తుంది.  తల్లి లేని పాప.. ఆ పాపను ప్రాణంగా ప్రేమించే తండ్రి.. ఆ పాపకు ప్రాణాపాయం.. తనను కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి తండ్రి చేసే పోరాటం, ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకటేష్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే లైన్ ఇది. ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉన్న స్టోరీ పాయింట్ ఇది. ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలను అందించిన దర్శకుడు  శైలేష్ కొలను,  వెంకీ మామతో ఇలాంటి సినిమా తీస్తున్నాడు అంటే.. మనకు కూడా ఖైదీ లాంటి మంచి సినిమా పడుతుందని అనుకుంటాం. కానీ శైలేష్ తన శైలిలో థ్రిల్ చేయలేకపోయాడు. కొన్ని ఎమోషనల్ సీన్ల వరకు బాగా డీల్ చేసినా.. మెప్పించలేకపోయాడు. కేవలం యాక్షన్ ఘట్టాలను స్టైలిష్ గా తీర్చిదిద్దడం మీదే దృష్టి పెట్టి.. ఒక హింసాత్మక యాక్షన్ సినిమాగా అందించాడు. ఓవరాల్ గా ఈ సినిమాలో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. వెంకటేష్ ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :