ASBL NSL Infratech

రివ్యూ :  లిప్ లాక్ బ్రాండెడ్ 'బబుల్ గమ్' 

రివ్యూ :  లిప్ లాక్ బ్రాండెడ్ 'బబుల్ గమ్' 

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల,
హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.
సంగీతం: శ్రీచరణ్ పాకాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం, ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుదల తేదీ : 29.12.2023
నిడివి : 148 నిముషాలు

స్టార్ యాంకర్ సుమ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎంతోమంది హీరోల సినిమాల పరిచయ వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఎన్నో భారీ ప్రోగ్రామ్స్ కి హోస్టింగ్ చేస్తుంది. టి వి స్క్రీన్ పై కూడా ఎన్నో గేమ్ షోస్, స్వరాభిషేఖం లో కూడా ప్రముఖ పాత్ర పోషించింది సుమ. ఇప్పుడు తన కొడుకు రోషన్ కనకాల ను 'బబుల్ గమ్'  సినిమాతో  హీరోగా తెలుగు తెర కు  పరిచయం పరిచయం చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రవికాంత్ పేరేపు రూపొందించారు. ఈ రోజే థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రం ఎలా వుంది. తొలి సినిమాతో హీరో గా రోషన్ కనకాల నిలబడతాడా? లేదా? రివ్యూ లో చూద్దాం.  

కథ :

ఆది (రోషన్ కనకాల) డీజే అవ్వాలని కలలు కంటాడు. తనకి ఎప్పటికైనా మంచి అవకాశం వస్తుందని, ఓ పబ్‌లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అదృష్టం కొద్ది అదే పబ్‌కి పెద్దింటి అమ్మాయి జాను (మానస చౌదరి) వస్తుంది. తొలిచూపులోనే మనోడి చూపు జానూ పాపపై పడుతుంది. ఆ పెద్దింటి పాప కూడా చూపు కలుపుతుంది. ఇంకేముందే మన ఆదిబాబు సీరియస్‌గా లవ్ చేసేస్తుంటాడు. జాను పాప మాత్రం.. అబ్బాయిలు మన చేతుల్లో  కీలు బొమ్మలవ్వాలి కానీ మనం బొమ్మలు కాకూడదని వెనక తిప్పించుకునే బాపతు. త్వరలో ఎలాగూ టర్కీ చెక్కేస్తుంది కాబట్టి, ఈలోపు ఎవడైనా బకరా దొరుకుతాడేమో చూస్తూ ఉంటుంది. ఇంతలో ఈ  పెద్ద బకరా ఆది బాబు దొరికకనే దొరుకుతాడు.

ఇంకేముంది ఇద్దరూ కలిసి సరదాలు షికార్లు.. రొమాన్స్‌లు, లిప్‌ లాక్‌లు గోవా ట్రిప్‌లు, పాపకి డబ్బు కి కరువు లేకపోవడంతో ఆది బాబుకి డబ్బుచ్చి కారుచ్చి బాగానే మేపుతుంది. ఈ జిందగీలో పిల్ల దొరకడమే పెద్ద గొప్ప. పైగా ఎదురు డబ్బిచ్చి ప్రేమించేది ఉందంటే అది దేవతే అని జాను పాపని ఆరాదించేస్తాడు ఆదిబాబు.  అన్ని విధాలుగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో జాను పాప, ఈ నేపధ్యం లో నిజంగానే ఆది ప్రేమలో పడుతుంది. అప్పటి వరకూ ప్రేమ అంటే యూజ్ అండ్ త్రో అనే అభిప్రాయంలో ఉన్న జానూ.. ఆదిలో నిజమైన ప్రేమికుడ్ని చూస్తుంది. అయితే భీకరమైన ఓ ముద్దు సీన్‌తో వీళ్లి మధ్య దూరం ఏర్పడుతుంది. చివరకు ఆది  జానూ  ఒకటి అయ్యారా ? లేదా ?, ఇంతకీ ఆది తన గోల్ ను రీచ్ అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

యాక్టింగ్ పరంగా.. అటు రోషన్‌కి కానీ.. ఇటు మానసకి కానీ వంకపెట్టలేం. ఇద్దరికి తొలి చిత్రమే అయితే.. ఎక్కడా కొత్త వాళ్లనే భావన కలగకుండా అనుభవం ఉన్న నటుల్లా పోటీ పడి చేశారు. లవ్, అండ్ ఎమోషన్స్ సీన్స్‌లో ఆకట్టుకున్నారు. రోషన్ కనకాల చూడ్డానికి హీరో మెటీరియల్ అనేట్టుగా లేకపోయినా, అతని కటౌట్‌కి తగ్గట్టుగానే ఎలివేషన్స్ ఇచ్చారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హైదరాబాదీ యువకుడు ఆది పాత్రకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు ఆది. డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఎమోషన్స్‌ని బాగానే పండించాడు. ఫస్ట్ సినిమాతోనే నటుడుగా రోషన్‌కి మంచి మార్కులే పడ్డాయి. యాంకర్ సుమ కొడుక్కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే లెక్క. ఇక తెలుగు హీరోయిన్ మానస చౌదరి అందానికి అందం పెర్ఫామెన్స్‌కి పెర్ఫామెన్స్ అనేట్టుగా అభినయంతో ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఈ పుత్తూరు పిల్ల తన  గ్లామర్‌ షోతో కుర్రకారుకి ఫుల్ కిక్ ఇచ్చింది. రొమాంటిక్ సీన్స్‌లో హీట్ పెంచే పెర్ఫామెన్స్ ఇచ్చింది. సెకండాఫ్‌లో ఎమోషన్స్ పిండేసింది. ఇక హీరో తండ్రిగా చేసిన చైతు జొన్నలగడ్డ థర్డ్ ప్లేస్ లో ఉంటాడు.  

చికెన్ షాప్ యాదగిరిగా అద్దరగొట్టేశాడు చైతు జొన్నలగడ్డ. ఇతను సిద్దు జొన్నలగడ్డకి స్వయానా అన్న కావడంతో ఫేస్ కట్‌లు కూడా సేమ్ అలాగే ఉంటాయి. డైలాగ్ డెలివరీ.. లుక్ మొత్తం సేమ్ టు సేమ్ సిద్దు మాదిరే ఉంది. పక్కా హైదరాబాదీ యాసలో విలక్షణ నటనతో నవ్వులు పూయించాడు. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్‌లలో చైతు అలరించాడు. బిందు చంద్రమౌళి, చైతు జొన్నలగడ్డల జోడీ భార్యభర్తలుగా భలే గమ్మత్తుగా వుంది. వీళ్లిద్దరి పెయిర్ సినిమాకి ప్లస్ అయ్యింది.  హైదరాబాద్ పోరగాళ్లు వాళ్ల పేరెంట్స్‌ని గుర్తు చేసుకుంటారు వీళ్లని చూసి.. అంతలా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. కామెడీ ట్రాక్ వర్కౌట్ అయ్యిందంటే వీళ్లిద్దరి వల్లే. వైవా హర్ష ఉన్నా అతని కామెడీ తేలిపోయింది. హీరోయిన్‌ పేరెంట్స్‌గా హర్షవర్ధన్, అనుహాసన్ ఆకట్టుకున్నారు. మోడ్రన్‌ పేరెంట్స్‌గా పాతికేళ్ల తరువాత వీళ్లిద్దరి పెళ్లి సీన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. హీరోకి ఫ్రెండ్స్‌గా కనిపించిన కిరణ్ మచ్చా, అనన్య ఆకుల ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాలతో దర్శకుడిగా క్రేజ్ దక్కించుకున్న రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ చిత్రంతో మరోసారి యూత్‌కి కనెక్ట్ అయ్యే కథాంశాన్ని ఎన్నుకున్నారు. పక్కా హైదరాబాదీ నేటివిటీకి అద్దం పట్టేట్టుగా ‘బబుల్ గమ్’ రుచి చూపించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్త వాళ్లే అయినా వాళ్ల దగ్గర నుంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ‘బబుల్ గమ్’ రొటీన్ ఫార్మేట్ లవ్ స్టోరీనే కానీ.. రవికాంత్ పేరేపు తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. అయితే ఈ ‘బబుల్ గమ్’లోని కొత్తదనం అందరికీ రుచించకపోడమే పెద్ద మైనస్. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ సీన్ తప్పితే మిగిలిందంతా చప్పగానే సాగుతుంది. ప్రేమకథ పండాలంటే లిప్ లాక్‌లు ఘాటు రొమాన్స్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ పండాలి. బబుల్ గమ్‌లో ఎమోషన్‌ని క్యారీ చేయలేకపోయాడు దర్శకుడు. బబుల్ గమ్ ఏంటీ.. ఇంత చప్పగా సాగుతుందీ అనుకునేలోపే.. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మంచి మజా వచ్చేట్టు చేశారు. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సురేష్ రగుతు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ఈ చిత్రం ద్వారా ఓ  కొత్తరకం అర్జున్ రెడ్డిని గుర్తు చేశాడు. వాళ్లిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. రొమాంటిక్ సీన్లలో మాత్రం.. వాళ్ల కెమిస్ట్రీ.. అబ్బో మామూలుగా లేదు. ముద్దు సీన్లలో మాత్రం ఇద్దరూ మామూలు పెర్ఫామెన్స్ చేయలేదు. పోటీ పడి జీవించేశారు. మామూలుగా ఒక సాంగ్‌లో ఒక్క లిప్ లాక్ అంటే కుర్రకారు ఎర్రెత్తిపోతారు. ఇంటర్వెల్ ముందు వచ్చే గోవా ట్రిప్ సాంగ్‌లో లెక్క పెట్టాలే కానీ సాంగ్ మొత్తం లిప్ లాక్‌లే. యూత్‌ని ఆ సాంగ్‌తో గట్టిగానే లాక్ చేశారు రోషన్, మానసలు. ఐతే....  కథ, కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాలోని అసలు కథకి సంబంధం లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ ను కలిగిస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించక పోయినా యూత్ ని కొంత మేరకు ఆకట్టుకుంటాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :