ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ప్రభాస్ హీరోయిజం హైలెట్ గా ‘సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్’

రివ్యూ : ప్రభాస్ హీరోయిజం హైలెట్ గా ‘సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : హోంబలే ఫిలిమ్స్,
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ, షఫీ,
శ్రియా రెడ్డి, దేవ్ రాజ్, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ తదితరులు
ఛాయాగ్రహణం: భువన గౌడ, సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి, మాటలు : సందీప్ రెడ్డి బండ్ల, హనుమాన్ చౌదరి, డా. సూరి,
పాటలు : కృష్ణ కాంత్, కథా మూలం : ఉగ్రం
నిర్మాత: విజయ్ కిరగందూర్; కథ, కథనం, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: 22.12.2023

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్, రెండు 'ప్ర' ల కాంబినేషన్ లో 'కెజిఎఫ్' మూవీ వారి హోంబ‌లే ఫిలిమ్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ - సీజ్ ఫైర్’  హృదయాన్ని హత్తుకునే ఫ్రెండ్ షిప్, వావ్ అనిపించే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ. 'బాహుబలి'తో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే, ఇప్పటివరకు ఆ స్థాయి విజయం రాలేదు. 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయడంతో మాంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశ పడ్డారు. భారీ అంచనాల మధ్య ఈరోజు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అదే విధంగా ఆంద్రా, తెలంగాణలో కూడా అర్ధరాత్రి నుంచి షోలు పడుతున్నాయి. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేకుండానే ఇండియాని షేక్ చేసింది. మరి.. ఎన్నో అంచనాలతో  ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంది? బాక్సాఫీస్ ని ఎంతవరకు షేక్ చేయబోతుంది? ప్రభాస్ రేంజ్ కి తగ్గ విజయాన్ని అందించిందా లేదా? ఇలాంటి అన్నీ విషయాలను ఈ రివ్యూ లో చూద్దాం!

కథ :

ముందుగా సలార్ కథ విషయానికి వస్తే.. సినిమా ఓపెనింగ్ దేవా (ప్రభాస్) వరద రాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) చిన్నతనంలో ప్రాణస్నేహితులుగా కథ మొదలవుతుంది. కట్ చేస్తే...విదేశాల్లో ఉండే కృష్ణ కాంత్ కుమార్తె ఆధ్య (శృతి హాసన్) తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది. ఖాన్సార్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో రక్షణ కోసం బిలాల్ (మైమ్ గోపి)కి ఫోన్ చేస్తారు. దేవా సూచనలను పాటిస్తూ... ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి, అతడి దగ్గరకు తీసుకువెళతాడు. దేవా బొగ్గు గనుల్లో పని చేస్తుంటే... అతడి తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఏడేళ్ళ క్రితం ఏం జరిగింది? ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త (అంటే రాజు) రాజ మన్నార్ (జగపతి బాబు) ఆ సామ్రాజ్యానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కక్కరు దొర గా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరద రాజ మన్నార్ ను దొర గా చూడాలనుకుంటున్నానని తన కోరిక చెపుతాడు. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్నీ వదిలి తిరిగొచ్చేలోపుగా... ఆయన కుర్చీ మీద కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో... రాజ మన్నార్  కొడుకు, వరద రాజ మన్నార్ కు అండగా నిలబడిన దేవా ఏం చేశాడు? అనేది మిగతా  సినిమా కథ.

నటీనటుల హావభావాలు:

'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ ను చూస్తే ఫాన్స్ పాలాభిషేకం చేసే నిలువెత్తు కట్ అవుట్ గుర్తుకొస్తుంది. సలార్ సినిమా మొత్తం మీద గొప్పగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటన గురించే. పేరుకి దేవా అనేది ఒక క్యారెక్టర్ అయినా.. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కథ అంతా తాను మోస్తూ.. ఎక్కడ ఏ మేరకు ఎమోషన్ పలికించాలో ప్రభాస్ అలా నటించి మెప్పించాడు. బాహుబలి తరువాత  హీరోయిజం, ఆ హీరో ఎలివేషన్స్ ప్రభాస్ కటౌట్ ఉండటంతో వర్కవుట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సులలో ప్రభాస్ అవలీలగా చేసేశారు. ఆ ఫైట్స్ చేయడానికి పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు. ప్రభాస్ లుక్స్ బావున్నాయి. ప్రభాస్ తరువాత పృథ్విరాజ్ గురించి చెప్పుకోవాలి. వరద పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా.. పృథ్వీరాజ్ సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఫస్ట్ ఆఫ్ లో శృతిహాసన్ ఎక్కువ సేపే కనిపించడంతో ఆమె క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది. కన్న బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీ రావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే. కానీ, ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

సలార్ మూవీ కంటెంట్ పరంగా, ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా నిలిచిందో.. టెక్నీకల్ గా కూడా అంతే బలంగా ఉంది. ప్రభాస్ కటౌట్, పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్లుగా ఇచ్చారు. కానీ, కథ, కథనం విషయంలో డిజప్పాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్స్ మధ్యలో కథ చిన్నబోయింది. ప్రశాంత్ నీల్.. కెజీయఫ్ ఫ్రాంచైజీతో తనకి దక్కిన సక్సెస్ కి కారణం లక్ కాదు, తన టాలెంట్ అని సలార్ తో నిరూపించుకున్నాడు. 'ఉగ్రమ్'ను అటు ఇటు తిప్పి 'సలార్'గా తీశారా? లేదంటే ఇది కొత్త కథ? అనేది పక్కన పెడితే... 'ఉగ్రమ్' కంటే 'కెజియఫ్'ను అన్ని భాషల ప్రేక్షకులూ చూశారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేశాయి. ప్రధానంగా రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి మెంటల్ ఎక్కిపోద్ది. ఇలాంటి సినిమాలకి నిర్మాతలు ఎంత బలంగా నిలబడాలో హోంబలే బ్యానర్‌ మరోసారి ఋజువు చేసింది.  

విశ్లేషణ:

'సలార్'లో ఏముంది? అని చూస్తే... 'హీరోయిజం! హీరో ఎలివేషన్లు! అంతేగా' అని క్లుప్తంగా, ఆలోచించకుండా చెప్పవచ్చు. కథ, కథనం కంటే హీరోయిజం! హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు! మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. ఒక్క రోజులోనే 2 వందల కోట్ల వసూళ్ళకు కారణం కూడా ఆ హీరోయిజమే! అయితే... 'కెజియఫ్'లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. 'సలార్'కు వస్తే... ఆ హీరోయిజం మిస్ కాలేదు. కానీ, కథ మాత్రం డిజప్పాయింట్ చేసింది. బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్బేధ్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్ను వేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, బయట నుంచి లోపలకు వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం వంటివి 'కెజియఫ్ 1'ను తలపించాయి. అయితే... క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను 'కెజియఫ్' నుంచి వేరు చేసింది. లేదంటే సేమ్ టు సేమ్ అన్నట్లు ఉండేది. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ప్రశాంత్ నీల్ తీశారు. ప్రభాస్ విగ్రహం అతని యాక్షన్... సినిమాలో ఆ  ఒక్కటే మెప్పిస్తుంది. కథాపరంగా వీలైనంతగా తక్కువగా అంచనా పెట్టుకుని థియేటర్లకు వెళితే సినిమా బాగుంటుంది. 'కెజియఫ్' ని దృష్ఠి లో పెట్టుకుంటే డిజప్పాయింట్ అవుతారు. ప్రభాస్ అభిమానులకు, మాస్ జనాలకు నచ్చే సినిమా ఇది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :