ASBL NSL Infratech

రివ్యూ : మెరుపులు లేని 'ఫ్యామిలీ స్టార్'

రివ్యూ : మెరుపులు లేని 'ఫ్యామిలీ స్టార్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్,
ప్రభాస్ శ్రీను, రోహిణి హట్టంగడి, దివ్యాంశ కౌశిక్, రవిబాబు, అచ్యుత్ కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్, సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ, నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం : పరశురామ్ పెట్ల
విడుదల తేదీ : 05.04.2024
నిడివి : 2 ఘంటల 43 నిముషాలు  

2018 లో వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా తరువాత.... దాదాపు 6 ఏళ్ళ నుండి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గీతగోవిందం' తరువాత దర్శకుడు పరుశురామ్‌తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు -  శిరీష్ లు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్, వగైరా వగైరా ఐటమ్స్ తో పెద్ద ఎత్తున హైప్ తీసుకురావడం తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' ఎలా ఉందో? వారి అంచనాలను అందుకుందా? విజయ్ దేవరకొండ, పరుశురామ్‌, దిల్ రాజుల కాంబినేషన్ వర్క్ అవుట్ అయ్యిందో లేదో సమీక్షలో చూద్దాం!  

కథ :

ఇక కథ విషయానికొస్తే... ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) అంటే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్ గా  చిన్నపాటి ఉద్యోగంతో పేరుకు తగ్గట్టుగానే తన కుటుంబ గిరిని అదుపు పొదుపులతో బరువు భాద్యత లను మోస్తుంటాడు. అన్నా, వదినలు, పిల్లల కోసం బతికే యువకుడు. వాళ్లింట్లో పెంట్ హౌస్ అద్దెకు తీసుకుంటుంది ఇందు (మృణాల్ ఠాకూర్). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. ఇంట్లో అందరితో కలివిడిగా కలిసిపోతుంది. తొలుత ఇందుకు దూరంగా ఉన్నప్పటికీ... మెల్లగా ప్రేమలో పడతాడు గోవర్ధన్. తన ప్రేమను చెప్పాలని అనుకున్న సమయానికి ఇందు చేసిన ఓ పని వల్ల బాగా హార్ట్ అవుతాడు. అసలు, ఇందు ఏం చేసింది? హర్ట్ అయిన గోవర్ధన్ ఏం చేశాడు? ఇద్దరూ అమెరికా ఎందుకు వెళ్లారు? మిడిల్ క్లాస్ కుర్రాడితో డబ్బున్న అమ్మాయి ప్రేమ కథలో మనస్పర్థలు, అడ్డంకులు ఏం వచ్చాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.

నటీనటుల హావభావాలు :

సినిమాలో విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా మనకు కనిపిస్తాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగే యువకుడి పాత్రను విజయ్ పోషించాడు. యాక్టింగ్ విషయానిస్తే.. వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. సినిమా కథకు తగ్గట్టు విజయ్ దేవరకొండ తన నటనను మార్చుకున్న విధానం తెర మీద కనిపిస్తోంది. సినిమా భారం మొత్తాన్ని విజయ్ తన భూజాల మీద మోసాడు. ఇక మృణాల్ ఠాకూర్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. గ్లామర్‌గా కనిపించడానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ. తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెర మీద  విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా వీరితో జగపతిబాబు, సీనియర్ నటి రోహిణి హట్టంగడి తమ పాత్రలకు పూర్తి  న్యాయం చేశారు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ శ్రీను, సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ కాసేపు నవ్వించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పరిధి మేర నటించారనే చెప్పాలి.  

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా స్టార్ట్ అయినా తరువాత కథలోకి వెళ్లడానికి  దర్శకుడు పరశురామ్ పెట్ల కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈతరం ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో విజయ్ దేవరకొండ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన్ను మిడిల్ క్లాస్ కుర్రాడిగా చూపించడానికి కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని కామెడీతో నడిపించి సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా ముందుకు తీసుకువెళ్తాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటీ కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు ఫ్యామిలీని పక్కనపెట్టి హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు దర్శకుడు. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. క్లైమాక్స్‌కు ఓ 20 నిమిషాల ముందు వరకు విలన్ ఎవరూ లేరు. అప్పటి వరకు మూవీ రన్ టైమ్ బిగ్గెస్ట్ విలన్ రోల్ ప్లే చేసింది. 'గీత గోవిందం'లో బ్యాక్ టు బ్యాక్ సన్నివేశాలతో ఫన్ & ఎమోషన్ వర్కవుట్ చేసిన పరశురామ్...ఆ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ సన్నివేశాలతో ఎంగేజ్ చేయలేదు. ట్రాక్ తప్పినట్లనిపించింది. సంభాషణల్లో కొన్ని తప్పితే పెద్దగా మెరుపులు లేవు. గోపీసుందర్ పాటల్లో 'మధురము కదా...' బావుంది. 'కల్యాణీ వచ్చా వచ్చా'కు సరైన ప్లేస్‌మెంట్ లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఫైట్ మాస్టర్లను మెచ్చుకోవాలి. నేల విడిచి సాము వంటి ఫైట్స్ పెట్టకుండా...  ఫ్యామిలీ టచ్ పోకుండా....డీసెంట్ ఫైట్స్ తో అలరించారు. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

విశ్లేషణ:

దర్శకుడు పరశురాం మెయిన్ గా తన నుంచి ఉండే ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ నరేషన్ ఈ చిత్రంలో బాగా మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఏవో చాలా తక్కువ సీన్స్ మినహా సినిమాని తాను బోర్ గానే నడిపించారు. విజయ్, పరశురాం పెట్ల హిట్ కాంబినేషన్ నుంచి అంచనాలు అందుకునే రేంజ్ సినిమా అయితే ఇది కాదు. ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు, కథనం నిరాశపరుస్తుంది. దర్శకుడు ఇంకా కథ, కథనాలు పై వర్క్ చేయాల్సింది. కథలో కొత్తదనం లేదు. సినిమా చూసేటప్పుడు ఇంతకు ముందు చూసినవి గుర్తుకు వస్తాయి. కథలో పాత వాసనలు ఉన్నాయి. పరశురామ్ పాత కథను కొత్త సీసాలో చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల, కథ కంటే ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి. సినిమా నిదానంగా మొదలవుతుంది... . ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. చివరి 20 నిమిషాలు ఎంగేజ్ 'నెక్స్ట్ ఏంటి?' అనిపిస్తుంది. ఏ మాత్రం భారీ అంచనాలు లేకుండా సినిమాకు  వెళితే... మధ్యలో కొన్ని మూమెంట్స్, కామెడీ సీన్లు ఎంజాయ్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్, మహిళలకు నచ్చే కంటెంట్ అయితే ఉంది. ఈ సినిమా బిలో యావరేజ్ టాక్ తో నిలిచిపోయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :