ASBL NSL Infratech

రివ్యూ : కథలో త్రివిక్రమ్ మమకారం తగ్గిన 'గుంటూరు కారం'

రివ్యూ : కథలో త్రివిక్రమ్ మమకారం తగ్గిన 'గుంటూరు కారం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : హారిక హాసిని క్రియేషన్స్
నటీనటులు: మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం,
వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, తదితరులు
సంగీతం: తమన్, సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస - పీ ఎస్ వినోద్
ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన - దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ : 12.01.2024
నిడివి : 2 ఘంటల 39 నిమిషములు

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ  సంక్రాంతి సినిమాల్లో అదే అగ్ర తాంబూలం తీసుకుంది. ఎప్పుడో 19 ఏళ్ళ క్రితం వచ్చిన అతడు, 14 ఏళ్ళ క్రితం వచ్చిన ఖలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. మరి సంక్రాంతి బరిలో మహేష్  సినిమా అంటే పందెంకోడి కాలుకి కత్తి కట్టినట్టే. సూపర్ స్టార్ బొమ్మపడిందంటే బాక్సాఫీస్ పందెం కొట్టినట్టే. అందులోనూ.. గురూజీ త్రివిక్రమ్, మహేష్‌లది ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కమర్షియల్ హిట్ పక్కా అనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్. పండగ రోజుల్లో మహేష్ ని చూడగానే మజా వస్తుంది, ఫాన్స్  హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది, మరి నిజంగానే థియేటర్లలో విజిల్ వేయాలనిపించిందా? హాట్ బీట్ పెరిగిందా? ఈ పండక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తారో?  లేదో సమీక్షలో చూద్దాం.

కథ :

చిన్నతనంలోనే వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు)ను తల్లి వసుంధర (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్తుంది. ఆ తర్వాత తండ్రి రాయల్ సత్యం (జయరాం) తన బావమరుదులతో కలిసి మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అనుకోకుండా ఒక హత్య కేసు లో ఇరుక్కుని జైలు పాలవుతాడు. సత్యం జైలుకు వెళ్లడంతో అత్త (ఈశ్వరీరావు) పెంపకంలో పెరుగుతాడు రమణ. గుంటూరులో మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్‌తో తల్లిపై విఫరీతమైన ద్వేషంతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టించాలని తల్లి, తాత వెంకటస్వామి (ప్రకాశ్ రాజ్) ప్రయత్నిస్తుంటారు. భర్తను, కొడుకు రమణను తల్లి ఎందుకు వదిలేసి మరో వ్యక్తి (రావు రమేష్)ను ఎందుకు పెళ్లి చేసుకొన్నది? కొడుకు నుంచి వసుంధరను ఆమె తండ్రి వెంకటస్వామి (పకాశ్ రాజ్) ఎందుకు దూరం చేశాడు. రమణ తండ్రి సత్యం ఎందుకు జైలుకు వెళ్లాడు? అమ్ము (శ్రీలీల) ఎవరు? ఆమెతో రమణ ఎలా లవ్‌‌లో పడ్డాడు? రాజీ (మీనాక్షి చౌదరీ)తో రమణ సంబంధం ఏమిటి? చివరకు తల్లి, తాత కోరిన బాండ్‌పై రమణ సంతకం పెట్టాడా? తల్లి ప్రేమను రమణ పొందాడా? చేయి విడిచిన కొడుకు చేతిని తల్లి వసుంధర పట్టుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే గుంటూరు కారం చిత్ర కథ.

నటి నటుల హావభావాలు:

మహేష్ తన నుంచి ఆశించే అసలుసిసలు మాస్ మసాలాను ‘గుంటూరు కారం’లో అందించలేకపోయారు. లుక్స్, పెర్ఫామెన్స్, మాస్ అప్పీరెన్స్, కామెడీ టైమింగ్, బాడీ ఈజ్, డాన్స్, నెక్స్ట్ లెవల్. కానీ.. మహేష్ ఎంత మాస్ అవతారం ఎత్తినా.. క్లాస్‌ పాత్రలకు కనికట్టు చేసినంతగా మాస్ పాత్రల్లో ఇమిడిపోవడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా రమణగాడిగా గట్టిగానే ఘాటు చూపించారు. నక్కిలీసు గొలుసు సాంగ్‌ కానీ, ఇంటర్వెల్ ఫైట్‌ కానీ, కుర్చీ మడత సాంగ్ కానీ, నిజంగానే ఫ్యాన్స్‌ని కుర్చీలలో కూర్చోనీయలేదు. పూర్తి  బాధ్యతను తన భుజాలపై మోసి సినిమాని సేఫ్‌లో పడేయడంలో మహేష్ బాబు దిట్ట. ‘గుంటూరు కారం’ సినిమాలోనూ అదే మ్యాజిక్ చేశారు మహేష్. రమణగాడి పాత్ర వరకూ ‘గుంటూరు కారం’ సినిమాకి ఫుల్ మార్కులే పడ్డాయి. ఆయన పెర్ఫామెన్స్‌ గురించి వేరే చెప్పాలా? ఇక హీరోయిన్స్ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ల పాత్రలు చాలా చిన్నవి. కానీ శ్రీ లీల అందాల ఆరబోతలో మీనాక్షి కంటే నాలుగు మార్కులు ఎక్కువే వేసుకుంది. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీరావు.. లాంటి బలమైన కాస్టింగ్ ఉన్నా, వాళ్ల నుంచి అబ్బా అనిపించేట్టుగా బలమైన సీన్లు లేకపోవడం గుంటూరు కారంలో ఘాటు తగ్గడానికి ప్రధాన కారణం. పాత్రలు ఎంట్రీ ఇచ్చినంత ఎంగేజింగ్‌గా ఎగ్జిట్ లేదు. పాత్రల్ని సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. కథతో పాటు పాత్రలు జర్నీ చేయలేకపోయాయి. అసలు జగపతి బాబు ఎందుకు ఉన్నారో.. అతనితో ఏం చేయించారో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇక తనదైన కామెడీ తో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

కథకు బలమైన నేపథ్యం ఉన్నబలమైన సన్నివేశాలు తోడైతే రిజల్ట్ సాలిడ్‌గానే ఉంటుంది. అసలు కంప్లైంట్ అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పైకే వెళుతుంది. మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్‌కి మహేష్ కాంబో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ హై రేంజ్‌లో ఉంటాయి.. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు. బంధాలకు, అనుబంధాలకు, భావోద్వేగాలకు పెద్ద పీట వేసే త్రివిక్రమ్, కథేలో ఏముందిలే! అనుకున్న కథల్ని కూడా తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతం అనిపించేట్టు చేయగలరు. కానీ, ‘గుంటూరు కారం’లో కథని ఎమోషనల్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే స్కోప్ ఉన్నా, భారం మొత్తం మహేష్‌పై వదిలేశారు. మహేష్ లుంగీ కడ్తే చూస్తారు, బీడీ కాలిస్తే విజిలేస్తారు, కుర్చీ మడత పెడితే తిరిగుండదనే ధీమానో ఏమో కానీ, ఖచ్చితంగా ఇది త్రివిక్రమ్‌ మార్క్ సినిమా లా ఉండదు. పోనీ కొత్తదనం అని సరిపెట్టుకుందామనుకున్నా, సినిమాలో చెప్పినట్టుగా, ‘అప్పుడెప్పుడో పాత సినిమాల్లో చూసాం ఇలాంటి ఏసాలు’ అనేట్టుగానే ఉన్నాయి చాలా సన్నివేశాలు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. విజువల్ బాగున్నాయి. థమన్ మ్యూజిక్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే దాదాపు అన్ని పాటలు మంచి హిట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ ఒకే. డాన్స్ మాస్టర్స్ తమ ప్రతిభను సాంగ్స్ లో జోష్ గా కనపర్చారు. ఇక సినిమా నిర్మాణపు విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.  

విశ్లేషణ:

ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ ‘గుంటూరు కారం’, త్రివిక్రమ్ మార్క్ కామెడీ, మహేష్  నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే, బలమైన కథ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం, దీనికితోడు నాటకీయ సన్నివేశాలు, అలాగే కొన్ని చోట్ల స్లో కథనం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మదర్ సెంటిమెంట్ అనేది కథకి బేస్ పాయింట్, అయినా.. చివరి వరకూ కూడా తల్లీ కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ సీన్ పడలేదు. ప్రీ క్లైమాక్స్‌లో తల్లీకొడుకుల మధ్య సీన్ లాంటిది ఇంటర్వెల్‌కి ముందు పడి ఉంటే.. సెంకడాఫ్‌పై మరింత పట్టు ఉండేది. కానీ అప్పటికే కథ గాడి తప్పేసింది. మహేష్ మ్యాజిక్‌ని.. ఆయన మేనరిజంని చూడ్డం తప్పితే.. కథకోసం కాదన్నట్టుగా మారింది పరిస్థితి. కథ కాస్త గాడితప్పుతుందన్నప్పుడల్లా.. కమర్షియల్ అంశాలను జోడించి కథలో చలనం రప్పించడంలో గురూజీ దిట్టే. సీనియర్ యాక్టర్లతో సపోర్టింగ్ కాస్ట్ బలంగా కుదిరినా గురూజీ తన మ్యాజిక్ చూపించలేకపోయారు.

ఓవరాల్‌గా ‘గుంటూరు కారం’లో మహేష్ బాబు మెప్పించాడు, త్రివిక్రమ్ నిరాశపరిచాడు. ‘గుంటూరు కారం’లో కథకి కావాల్సిన మామకారం లేదు, అనుకున్నంత ఘాటూలేదు. కానీ ఫ్యాన్స్ వరకూ కుర్చీ మడతపెట్టొచ్చు, భారీ అంచనాలతో విడుదలైంది కాబట్టి  కలెక్షన్లకు కొదువేం ఉండదు,  హై ఎక్సపెక్టషన్ తో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. గుంటూరు కారం మ‌హేష్ ఫ్యాన్స్‌ను మాత్ర‌మే మెప్పించే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ. త్రివిక్ర‌మ్ మ్యాజిక్ మిస్ ఫైర్ కావ‌డంతో యావ‌రేజ్ స్థాయిలోనే ఈ సినిమా మిగిలిపోయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :