ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : 'నా సామిరంగ'! మహా గొప్పగా ఉందిరా సినిమా!!

రివ్యూ : 'నా సామిరంగ'! మహా గొప్పగా ఉందిరా సినిమా!!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్,
మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్, నాజర్, రావు రమేష్, రవి వర్మ, షబ్బీర్ కల్లరక్కల్, మధుసూధన రావు తదితరులు నటించారు.

సంగీతం : ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : శివేంద్ర దాశరధి
ఎడిటర్ : చోట కె ప్రసాద్
సాహిత్యం: ఎం ఎం కీరవాణి, చంద్రబోస్
మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: విజయ్ బిన్ని

విడుదల తేదీ : 14.01.2024

నిడివి : 2 ఘంటల 26 నిమిషములు

కొరియోగ్రాఫర్‌గా విజయ్ బిన్ని సినిమా ప్రేక్షకుడికి తెలిసినవాడే! ఇప్పుడు నాగార్జున ఇచ్చిన ఈ ఛాన్స్‌ తో 'నా సామిరంగ' చిత్రానికి మాస్టర్ కాస్త దర్శకుడిగా మారాడు. నా సామిరంగ అంటూ మంచి మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమా ఈ సంక్రాంతికి నేడు జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది. నిజానికి ఇది ‘పోరింజు జొస్ మరియమ్’ మలయాళం రీమేక్ అయినా కూడా పర్‌ఫెక్ట్ తెలుగు సినిమా, సంక్రాంతికి రావాల్సిన సినిమా అన్నట్టుగా కనిపించింది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేస్తుండగా.. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అంతా ముందు నుంచే భావించారు. మరి ఈ చిత్రం కథ, కథనాలు ఏంటో? నాగార్జున సంక్రాంతి ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడో లేదో ఓ సారి చూద్దాం!

కథ :

నా సామిరంగ కథ 1960వ దశకంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రాంతంలో ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తుడు వరదరాజులు (రావు రమేష్) ఊర్లో అందరి పొట్ట కొడుతుంటాడు. వడ్డీల పేర్లతో జనాల్ని దోచుకుంటూవుంటాడు. ఆ వూర్లో కృష్ణయ్య(నాగార్జున) ఓ అనాధ. ఓ సారి ఆకలిగా ఉన్న కృష్ణయ్యకు అంజి (అల్లరి నరేష్) వాళ్ల అమ్మ అన్నం పెడుతుంది. అప్పటి నుంచి అంజి, కృష్ణయ్యలు అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. ఇది ఇలావుండగా... అంజి అమ్మ అకస్మాత్తుగా మరణిస్తుంది. ఆ తరువాత ఇంటిని జప్తు చేయాలని వరదరాజులు వస్తాడు. కానీ అదే టైంలో తరువాత పెద్దయ్య (నాజర్) వచ్చి డబ్బులిచ్చి ఆ ఇంటిని విడిపిస్తాడు. దీంతో కృష్ణయ్య పెద్దయ్య దగ్గర ఉండి ఆ ఊరిని, పెద్దయ్యని చూసుకుంటూ కుడిభుజంగా ఉంటాడు. 20 ఏళ్ళ తర్వాత అసలు కథలోకి తీసుకువస్తారు.

భాస్కర్(రాజ్ తరుణ్) పక్కూరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)ని ప్రేమించాడని తెలియడంతో వాళ్ళు భాస్కర్ ని చంపడానికి వస్తే కృష్ణయ్య కాపాడుతాడు. భాస్కర్ కృష్ణయ్యకి ప్రేమ ఉందా అని అంజిని అడగడంతో గతంలో చిన్నప్పటి నుంచి కృష్ణయ్య, వరాలు(ఆషిక రంగనాధ్)ప్రేమ గురించి, వాళ్ళ గిల్లికజ్జాలు, ఆ తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు, వరాలుతో పెళ్లి ఆగిపోవడం.. అంటూ కథ మొత్తం చెప్తాడు. అదే సమయానికి దుబాయ్ నుంచి ఊళ్లోకి వచ్చిన పెద్దయ్య చిన్న కొడుకు దాస్ (షబ్బీర్ కల్లరక్కల్) వరాలుతో మిస్ బిహేవ్ చేయడంతో అంజి చూసి అతనితో గొడవకు దిగడంతో అసలు కథ మొదలవుతుంది. దాస్ అంజి, కృష్ణయ్యలని చంపాలని, వరాలుని దక్కించుకోవాలని, మరో పక్క ప్రెసిడెంట్ భాస్కర్ ని చంపాలని చూస్తుంటారు. మరి ఈ పగలు ప్రతీకారాలు ఎలా ముందుకెళ్లాయి? కృష్ణయ్య, వరాలు ఒక్కటయ్యారా? పెద్దయ్య కొడుకు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. అతని ఎనర్జీ, ఛార్మింగ్ ప్రేక్షకుడికి బోర్ కొట్టనివ్వదు. ఎంత రొటీన్ సినిమాగా అనిపిస్తున్నా కూడా నాగ్ యాక్టింగ్, ఎనర్జీతో అవన్నీ కనిపించకుండాపోతాయి. నాగార్జున మరోసారి ఆడియెన్స్‌ను తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఇక అల్లరి నరేష్ పాత్ర ఈ సినిమాకు మేజర్ అస్సెట్. నవ్వించాడు. ఏడ్పించాడు. అల్లరి నరేష్ తన పాత్రకు వందకు రెండొందల శాతం న్యాయం చేశాడు. నరేష్‌కు కథలో బాగానే స్కోప్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయి. నాగార్జున స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ పడకపోయినా.. నరేష్‌ కూడా యాక్షన్ సీక్వెన్స్‌లో కుమ్మేశాడు. రాజ్ తరుణ్ కూడా తన పాత్రతో ఆకట్టుకుంటాడు. ఆశిక రంగనాథ్ అందం.. కనిపించిన తీరు..నటించిన తీరు కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మిగిలిన పాత్రలు రొటీన్‌గానే అనిపిస్తాయి. మిర్నా మీనన్ పోషించిన పాత్ర కొంతలో కొంత నయం అనిపిస్తుంది. కానీ రుక్సర్ కారెక్టర్ మాత్రం ఆటలో అరటి పండులా అనిపిస్తుంది. నాజర్‌కు ఇలాంటి పాత్రలన్నీ కొట్టిన పిండి. రావు రమేష్ ఎప్పటిలాగే బాగానే మెప్పించాడు. విలన్‌గా దాసు కారెక్టర్‌లో షబ్బీర్ కల్లరక్కల్ కూడా బాగానే నటించాడు.

సాంకేతికవర్గం పనితీరు :

కీరవాణి సంగీతం పర్వాలేదు. క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరింది. ఈ సినిమాకు దాశరధి శివేంద్ర కెమెరామెన్ గా పనిచేశారు. 40 ఏళ్ళ క్రితం కథ, పల్లెటూరి కథకు తగ్గట్టు లొకేషన్స్, విజువల్స్ చక్కగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. హనుమాన్ సినిమాకు కూడా ఈయనే కెమెరామెన్ కావడం విశేషం. సినిమాటోగ్రఫి వింటేజ్ ఫీల్ ని తీసుకొస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది. ఇక దర్శకుడు విజయ్ బిన్నీ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి ఓకే అనిపించే వర్క్ చేసాడని చెప్పాలి. మెయిన్ లీడ్ అందరి నుంచి మంచి పెర్ఫార్మన్స్ లను తాను రాబట్టుకున్నాడు. కానీ కథనంని మాత్రం అంత ఆసక్తిగా మలచడంలో విఫలం అయ్యాడని చెప్పక తప్పదు. సినిమాని ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

విశ్లేషణ :

నా సామిరంగ సినిమా మలయాళం మాతృక ‘పోరింజు జొస్ మరియమ్’ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఆ రీమేక్ ఛాయలు ఎక్కడా కనపడకుండా మన ఒరిజినల్ తెలుగు సినిమాగా పూర్తిగా మార్చారు. ఫస్ట్ హాఫ్ లో కృష్ణయ్య, అంజిల బాల్యం, కృష్ణయ్య, వరాలు ప్రేమ కథ, అంజి పెళ్లి, దాస్ తో గొడవతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ, కామెడీతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ లో పెద్దయ్య కొడుకు దాస్ తో గొడవ జరగడంతో ఒక యాక్షన్ సీన్ తో హై వస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా దాస్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ పండించి క్లైమాక్స్ లో రివెంజ్ డ్రామాలా యాక్షన్ సీన్ తో ముగిస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ముందుకి, వెన్కక్కి వెళ్తూ ఉంటుంది. దీంతో ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సినిమా అంతా 1980లో, అంతకు ముందు 1960లో అంబాజీపేట అనే ఓ గ్రామంలో జరిగే కథలా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా నవ్వించి సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో నడిపించారు. సినిమాలో కూడా సంక్రాంతి చుట్టూ కథని రాసుకోవడం కూడా విశేషమే! ఎలాంటి భారీ అంచనాలు లేకుండా, పెట్టుకోకుండా.. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి హాయిగా కాసేపు నవ్వుకుని, కాసేపు బాధపడి, క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ తో ఎంజాయ్ చేసే సంక్రాంతి పండగకు తగ్గట్టు సినిమా అనిపిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :