ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ఎమోషన్స్ ని బజాహించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'

రివ్యూ : ఎమోషన్స్ ని బజాహించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు  : జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్
నటీనటులు: సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు
సినిమాటోగ్రఫి : వాజిద్ బేగ్, ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ: బన్నీ వాసు, వెంకటేష్ మహా
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
కథ, దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని
విడుదల తేదీ : 02.02.2024
నిడివి : 2 ఘంటల 12 నిముషములు

కలర్ ఫోటో తో ఓటీటీలో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన సుహాస్ తరువాత చేసిన రైటర్ పద్మభూషణ్ మీద కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటే.. ఇంకొందరు పెదవి విరిచారు. దాని కలెక్షన్ల మీద కూడా కాస్త కాంట్రవర్సీ ఉంటుంది. కానీ సుహాస్ పర్ఫామెన్స్ మీద మాత్రం ఎలాంటి కంప్లైంట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సుహాస్ మళ్లీ ఓ కథను ఆడియెన్స్‌కు చెప్పేందుకు వచ్చాడు. అదే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రం. ఇటీవల మంచి పబ్లిసిటీ తో వచ్చిన ఈ చిత్రం థియేటర్ లో ఈ రోజే విడుదల అయ్యింది. మరి ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందన్నది రివ్యూ లో చూద్దాం.

కథ :

అంబాజిపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతుంటాడు వెంకట్ (నితిన్ ప్రసన్న). ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూనే ఉంటారు. ఆ గ్రామంలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన మల్లికార్జున్ అలియాస్ మల్లి (సుహస్)
మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటుంది. పద్మకు వెంకట్‌కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ), మల్లి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్.. టీచర్‌గా పనిచేసే లక్ష్మీపై ఊరిపెద్ద వెంకట బాబు దౌర్జన్యం చేస్తాడు. ఆత్మాభిమానంతో ఉండే మల్లి, పద్మలకు వెంకట్ వైరం మొదలవుతుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో మల్లీ ఎలా నడిపిస్తుంటాడు? తన కులవృత్తిని చేస్తూ గ్రామంలో ఎలాంటి అవమానాలకు గురి అవుతుంటాడు. డబ్బు, అగ్ర కులం చాటున వెంకట్ బాబు ఎలాంటి అరాచకాలు చేస్తుంటాడు. తన అక్క లక్ష్మీకి జరిగిన అవమానానికి మల్లీ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? లక్ష్మీపై ప్రేమను పెంచుకొన్న సంజీవీ (జగదీష్)కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తన సోదరిపై దౌర్జన్యం చేసిన వెంకటబాబుకు ఎలాంటి శిక్షను మల్లి విధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మిగతా కథ.

నటీనటుల హావభావాలు :

సుహాస్ కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. నవ్వించాడు.. ఏడ్పించాడు.. చివర్లో ఎమోషన్స్, నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అద్భుతంగా అనిపించాడు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు  సుహాస్‌ చేస్తే తిరుగుండదనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన శివానీ తమ పెర్ఫార్మెన్స్‌తో సూపర్ హిట్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా చేసింది. విలన్‌గా నటించిన నితిన్ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు. చివర్లో అలా కనిపించేందుకు ఒప్పుకున్నందుకు, ఆ డేరింగ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జగదీష్‌కు మంచి పాత్ర పడింది. పుష్ప కేశవ తరువాత ఈ సంజీవ్ కారెక్టర్‌ కూడా గుర్తుండిపోతుంది. ఈ సినిమాకు ప్రాణం లక్ష్మీ పాత్రలో కనిపించిన శరణ్య ప్రదీప్. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె.. లక్ష్మీ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాను రకరకాల ఎమోషన్స్‌తో తన భుజాల మీద మోశారనే చెప్పాలి. ఈ చిత్రంలో అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటమే విశేషం.

సాంకేతికవర్గం పనితీరు :

మంచి కథాంశం తో సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరి, రూరల్ విలేజ్ డ్రామా, కుల వివక్ష, ధన వివక్ష లాంటి అంశాలతో రూపొందిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. తొలి చిత్ర దర్శకుడు దుశ్యంత్‌ కటికినేని రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. కథలో కొత్తదనం లేకపోయినా.. స్క్రీన్ ప్లే, రాసుకొన్న సీన్లు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. అదే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. శేఖర్ చంద్ర తన బీజీఎంతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. వాజిద్ బేగ్ తన కెమెరాతో కోనసీమ అందాలను మరోసారి రుచి చూపించాడు. పవన్ కల్యాణ్ ఎడిటింగ్, ధీరజ్ మొగిలినేని అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

అంబాజీపేట సినిమాలో చూపించిన కథ కొత్తదేమీ కాదు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల కుంపటి ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు. తక్కువ కులాలకు చెందిన వారిపై ఎంతటి వివక్ష చూపించేవారో అందరికీ తెలిసిందే. కుల వృత్తులు చేసుకునే వారి మీద ఎలాంటి చూపు చూసేవారో తెలిసిందే. కులాలు, పేదోళ్లు, ధనికులు, ప్రేమ అనే పాయింట్‌ల చుట్టూ ఎన్నో కథలు వచ్చాయి. ప్రేమ కథలు అంటే.. కులాలు, డబ్బు ఇలా ఏదో ఒకటి అడ్డు పడుతూనే ఉంటుంది. అయితే ఈ చిత్రం కేవలం ప్రేమ కథ కాదు. ప్రచార చిత్రాలు చూస్తే ఇది కేవలం ప్రేమ కథ అని అనుకుంటే పొరబాటు. నటీనటుల నటన, కథకు సరిపడా వుంది. కాకపోతే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం, రొటీన్ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ మెసేజ్ లాంటిది మాత్రం ఆకట్టుకుంటాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :