ASBL NSL Infratech

రివ్యూ : హాలీవుడ్ రేంజ్ 'ఈగల్' సైడ్ కి ఎగిరిపోయింది?

రివ్యూ : హాలీవుడ్ రేంజ్ 'ఈగల్' సైడ్ కి ఎగిరిపోయింది?

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్,
శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు
సంగీత దర్శకులు: డావ్ జాన్డ్
సినిమాటోగ్రాపర్స్ : కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్
ఎడిటర్, దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేదీ : 09.02.2024

సంక్రాంతి విడుదల కావాల్సిన 'ఈగల్' ప్రొడ్యూసర్స్ మీచువల్ అండర్స్టాండింగ్ తో సోలోగా ఈ రోజు విడుదలయ్యింది.  ట్రైలర్ అండ్ టీజర్ తో మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న రవితేజ 'ఈగల్' పై అంచనాలు ఎలా వున్నా... రవి తేజ సినిమాలంటేనే... ఎప్పుడు ఎలా వుంటాయో? ఏ చిత్రం హిట్ అవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అంతుబట్టని విషయం. మరి పీపుల్ మీడియా బ్యానర్ లో వచ్చిన 'ఈగల్' హిట్టో ఫట్టో రివ్యూలో తెలుసుకుందాం!  

ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ) కాంట్రాక్ట్ కిల్లర్ కానీ అతని విగ్రహాన్ని పెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు పత్తి రైతులు. తలకొన ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పరుచుకొని పత్తి రైతులకు అండగా ఉంటూ, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొంటాడు. ఐతే, జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి, ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తోంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. సహదేవ్, జయ్ (నవదీప్)తో కలిసి నక్సలైట్లు, పాక్ టెర్రరిస్టులు, ఇతర సంఘ విద్రోహ శక్తులకు ఆయుధాలు అందుకుండా ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. తలకొనలో పత్తి రైతులకు సహదేవ్‌కు సంబంధం ఏమిటి? చేనేత రైతులకు ఎలాంటి ఉపకారం చేశాడు? ఆయుధాల అక్రమ రవాణాను ఎలా అడ్డుకొన్నాడు. తలకొనలో నిర్మించుకొన్న వెపన్ ఫెసిలిటీని ఎలా ఉపయోగించుకొన్నాడు? సహదేవ్‌ను వెతుక్కొంటూ ఢిల్లీకి చెందిన జర్నలిస్టు నళినిరావు (అనుపమ పరమేశ్వరన్) ఎందుకు తలకొనకు వచ్చింది? రచన (కావ్య థాపర్)కు సహదేవ్‌కు రిలేషన్ ఏమిటి? తన సామ్రాజ్యాన్ని టార్గెట్ చేసిన ఇండియన్ ఆర్మీని సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈగిల్ సినిమా కథ.

నటీనటుల హావభావాలు:

ఈగిల్ మూవీలో రవితేజ వన్ మ్యాన్ షో అతనొక్కడే  చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక డైలాగ్ డెలీవరి కూడా కొత్తగా ఉంది. గెటప్, కారెక్టర్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌తో రవితేజ కేక పెట్టించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ, ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రవితేజ చాలా బాగా నటించాడు. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫెస్టివల్ వాతవారణాన్ని తెచ్చాడని చెప్పవచ్చు. ఇక రవితేజ పక్కన నవదీప్ మంచి క్యారెక్టర్‌లో మెప్పించాడు. కావ్య థాపర్ పాత్ర ఆటలో అరటిపండులా వున్నా...  రవితేజ తో సాగిన లవ్ స్టోరీలో ఆకట్టుకుంది. అనుపమ రోల్ కథను నడిపించడానికి ఉపయోగపడింది. మధుబాల, అవసరాల, వినయ్ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన ఈగల్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. డైరెక్టర్ ఎత్తుకొన్న పాయింట్ బాగుంది. కానీ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబాటు పడ్డారనిపిస్తుంది. ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫి, మ్యూజిక్, డైలాగ్స్ బ్యాక్ బోన్‌లా మారాయి. డైలాగ్స్‌లో పవర్ ఉన్నప్పటీకి సన్నివేశాల్లో పస లేకపోవడంతో వాటిని ఎలివేట్ చేయడంలో బీజీఎం పూర్తిగా సహకరించింది. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ విభాగం కాక  కథను క్లారిటీగా చెప్పే విషయంపై దృష్టిపెట్టాల్సింది. ఒకోసారి తెలుగు సినిమాను కాకుండా హాలీవుడ్ సినిమాను చూస్తున్నామా? అనేంతగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టి జి విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.  

విశ్లేషణ:

ఢిల్లీలో తలకొన చేనేత రైతులకు సంబంధించిన ఓ వార్తతో కేంద్ర ప్రభుత్వంలో అలజడి రేపడమనే ఎసిసోడ్‌తో సినిమా ను ఒక రేంజ్లో  స్టార్ట్ చేసి ఏదో కొత్త సబ్జెక్ట్ చూడబోతున్నామనే అనుభూతిని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చూపించాడు. కానీ  ఆ తర్వాత చేనేత విషయాన్ని వదిలేసి.. ఆయుధాలు, నక్సలైట్లు, పాక్ టెర్రరిస్టులు అనే విషయాలను పట్టుకొచ్చి కథను మరింత కంగాళీ చేశాడు. ఫస్టాఫ్‌లో సాగదీత, క్లారిటీ లేని సీన్లతో కథలో ఏం జరుగుతుందనే కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాడు. ఫస్టాఫ్ ఏదో జరిగిపోయింది.. సెకండాఫ్‌లో ఏం చేస్తాడో అనే ఆశాభావంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కథలో ఉన్న రకరకాల వేరియేషన్స్‌కు సంబంధించిన డీటైల్స్‌ను చెప్పడం ప్రారంభించడంతో కొంత బెటర్‌గా అనిపిస్తుంది. అనవసర విషయాలపై అతిగా శ్రద్దపెట్టడం వల్ల కథలో ఉండే స్ట్రాంగ్ ఎమోషన్స్ పక్కదారి పట్టాయనిపిస్తుంది. సినిమాకు బలంగా అనిపించే చేనేతల పాయింట్‌ను సైడ్ ట్రాక్ చేశాడనిపిస్తుంది. అయితే సినిమాను విజువల్ ట్రీట్‌గా మలిచే క్రమంలో కథను పక్కన పెట్టాశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి 20 నిమిషాల్లో కథను బలంగా చెప్పడం వల్ల అప్పటి వరకు నీరసంగా సాగిన మూవీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా రవితేజ నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ హాలీవుడ్ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌ను అందించడంలో సఫలమయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :