కాలిఫోర్నియాలో ఘనంగా విజయవాడ కనకదుర్గ కుంకుమపూజలు

కాలిఫోర్నియాలో ఘనంగా విజయవాడ కనకదుర్గ కుంకుమపూజలు

26-04-2017

కాలిఫోర్నియాలో ఘనంగా విజయవాడ కనకదుర్గ కుంకుమపూజలు

అమెరికాలో దాదాపు 10 నగరాల్లో జరగనున్న విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కనకదుర్గ కుంకుమార్చన పూజల్లో భాగంగా మిల్‌పిటాస్‌లోని  శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏప్రిల్‌ 22వ తేదీన కుంకుమ పూజ ఘనంగా జరిగింది. ఈ పూజకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

తెలుగు టైమ్స్‌, పాఠశాల కో ఆర్డినేషన్‌తో ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ, విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏప్రిల్‌ 22 నుంచి వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌ 22వ తేదీన శుక్రవారం జరిగిన తొలి కుంకుమార్చన పూజకు మంచి స్పందన వచ్చిందని విజయవాడ నుంచి వచ్చిన కనకదుర్గ దేవాలయం అర్చకులు తెలిపారు. స్థానిక దేవాలయం పూజారుల సహకారంతో శాస్త్రోక్తంగా ఈ పూజలను జరిపారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు కంకణాలు ధరింపజేసి వారిచేతనే శాస్త్రోక్తంగా అమ్మవారి పూజలను చేయించారు. త్రిశతి, ఖడ్గమాల, లలితసహస్రనామ పారాయణాల తరువాత పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదంతోపాటు, డాలర్‌ను, శేషవస్త్రాలను బహూకరించారు. తరువాత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు, పీఆర్‌ఓ అచ్చుతరామయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌తోపాటు ఈ కుంకుమార్చనల పూజలకు కో ఆర్డినేషన్‌ చేస్తున్న తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, పాఠశాల మేనెజింగ్‌ డైరెక్టర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రెసిడెంట్‌ వెంకట్‌ రెడ్డి మందాడి తదితరులు పాల్గొన్నారు.