కంకిపాడులో 'తానా' రైతు సదస్సు

కంకిపాడులో 'తానా' రైతు సదస్సు

23-04-2017

కంకిపాడులో 'తానా' రైతు సదస్సు

తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యాన కంకిపాడులోని మార్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటు చేసిన రైతు సదస్సును, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోయినా ముఖ్యమంత్రి ముందు చూపు కారణంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో రైతాంగానికి సకాలంలో సాగునీరందించామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయని తెలియజేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 28శాతం, ప్రసవాలు, 79శాతం ఓపీ పెరిగిందన్నారు. జనవరి నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలియజేశారు.

జెడ్పీ చైర్‌ పర్సన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ కార్లు కొనుగోలు చేసే వారికి బ్యాంకులు 9శాతం వడ్డీ విధిస్తుంటే రైతులకు మాత్రం యంత్రాలకు 14శాతం వడ్డీ తీసుకుంటున్నాయని మంత్రి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లారు. వ్యవసాయానికి వచ్చే సరికి యంత్రాలను కాకుండా పంటను గ్యారంటీగా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానా జాయింట్‌ కోశాధికారి అడుసుమిల్లి రాజేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, ఎంపీపీ దేవినేని రాజా, జెడ్పీటీసీ సభ్యుడు శివరామకృష్ణ ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ కొణతం సుబ్రహ్మణ్యం, తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ గోగినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.