ఐదుగురు అమ్మాయిలకు... యూఎస్‌ ఆహ్వానం

ఐదుగురు అమ్మాయిలకు... యూఎస్‌ ఆహ్వానం

17-08-2019

ఐదుగురు అమ్మాయిలకు... యూఎస్‌ ఆహ్వానం

ఒక్క ఐడియా ఐదుగురు అమ్మాయిల జీవితాలను మార్చేసింది. వారికి అమెరికా ఆహ్వానాన్ని అందజేసింది. ప్రపంచస్థాయి గుర్తింపుతోపాటు గూగుల్‌, అడోబ్‌, ఉబెర్‌ వంటి బడా సంస్థలకు తమ ఐడియాను అమ్మే అవకాశాన్ని కల్పించింది. ఈ భారతీయ యువతులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందినవారు. ఇక్కడి అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరంతా ఈ ఏడాది జరిగిన టెక్నొవేషన్‌ గర్ల్స్‌ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. సమాజంలోని సమస్యలకు మొబైల్‌ యాప్‌ల ద్వారా పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశ్యంతో ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారు. సుమారు 19 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో 38 దేశాల నుంచి సుమారు 170 టీమ్స్‌ సెమీస్‌కు చేరాయి.

సెమీస్‌లో చేరిన వారిలో భారత్‌కు చెందిన టెక్‌ విచెస్‌ బృందం కూడా ఉంది. అనన్య గ్రోవర్‌, అనుష్క శర్మ, అరిఫా, వన్షికా యాదవ్‌, వసుధ సుధీందర్‌తో కూడిన ఈ బృందం మైత్రి పేరుతో ఓ సరికొత్త యాప్‌ను సృష్టించింది. వృద్ధాశ్రమాలను, అనాధాశ్రమాలను అనుసంధానం చేస్తూ వృద్ధుల్లో, పిల్లల్లో ఒంటరి తనాన్ని పోగొట్టడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని అనన్య చెప్పారు. ఈ పోటీల్లో తొలి 12 స్థానాల్లో నిలిచే జట్టు.. గూగుల్‌, అడోబ్‌, ఉబెర్‌ వంటి ప్రముఖ సంస్థల ముందు తమ ప్రతిపాదనలను ఉంచుతాయి. ఆయా కంపెనీలకు నచ్చితే అవి ఈ ఐడియాలతో పాటు, సదరు అభ్యర్థులకు కూడా బంగారు భవిష్యత్తును అందజేస్తాయి. అలాగే ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.10 లక్షలపైగా నగదు బహుమతి అందజేస్తారు.