TANA: తణుకులో ‘రైతు కోసం తానా’ దిగ్విజయం.. 1500 మందికి పరికరాల పంపిణీ!
TANA: తణుకు పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నిర్వహించిన ‘రైతు కోసం తానా’ కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. స్థానిక రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ముఖ్య అతిథులు , పంపిణీ:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆప్కాబ్, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తమ చేతుల మీదుగా రైతులకు పవర్ స్ప్రేయర్లు , తార్పాలిన్లను అందజేశారు.
1500 మందికి లబ్ధి: సుమారు 1500 మంది రైతులకు ఈ పరికరాలను పంపిణీ చేసి, తానా తన సేవా నిరతిని చాటుకుంది.
స్థలం: తణుకులోని VK కన్వెన్షన్లో ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై విజయవంతంగా కొనసాగింది.
వివరాలు:
తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు, , ట్రెజరర్ రాజా కాసుకుర్తి సారథ్యంలో తానా ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సంక్షేమం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయ పనుల్లో రైతులకు భారం తగ్గించేందుకు అత్యాధునిక పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ప్రవాసంలో ఉన్నప్పటికీ తమ సొంత గడ్డపై ఉన్న రైతన్నల కష్టాలను గుర్తించి ఆదుకుంటున్న తానా సభ్యుల కృషిని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.








