అమెరికాలో ఖలిస్థానీల దుశ్చర్య.. స్వామీ నారాయణ్ టెంపుల్ గోడలపై అభ్యంతరకర రాతలు
కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఖలిస్థాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆయాదేశాల పౌరసత్వాన్ని సాధించుకున్న వీరు… అక్కడి గడ్డపై నుంచే భారత్ లో ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. వారిని ఏమైనా అందామా అంటే.. మా పౌరులని ఆయాదేశాలు హుంకరిస్తున్నాయి. వారిని చీమసైతం కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ ఆయా దేశాల చట్టాలను ఉపయోగించుకుని.. వారు భారత్ పై విషప్రచారం చేస్తున్నారు.అంతేకాదు.. భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
ఇదే కోవలోకి వస్తుంది..కాలిఫోర్నియాలోని నెవార్క్ లో ఉన్న స్వామినారాయణ్ ఆలయ విధ్వంసం. శుక్రవారం కొందరు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు….హిందూ దేవాలయం బయటి గోడపై భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు రాశారు. గ్రాఫిటీ ఉపయోగించి, హిందువు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.నెవార్క్ పోలీస్ సర్వీస్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఓ భారతీయుడిపై అభియోగాలు మోపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పన్ను హత్యకు భారతీయుడు గుప్తా కుట్రపన్నారంటూ ఆరోపణలు రావడం.. ప్రస్తుతం చెక్ ఆధీనంలో ఉన్న గుప్తాను అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది.
కాలిఫోర్నియాలోని నెవార్క్ లో ఉన్న స్వామినారాయణ్ మందిర్ ను భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయడాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఖండించింది. తక్షణమే విచారణ జరిపి, పరిస్థితిపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అటు భారత ప్రభుత్వం సైతం… ఆలయ విధ్వంసంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. అమెరికా ప్రభుత్వం, అధికారులను కోరింది.
అయితే అగ్రరాజ్యం అమెరికా తీరును చూస్తుంటే.. ఆ దేశం కూడా ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులకు మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదేశం భూభాగంపై నుంచే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాద నేత పన్ను హెచ్చరిస్తూ ప్రకటనలు చేస్తున్నా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కానీ.. పన్నుకు వ్యతిరేకంగా కుట్ర జరిగినట్లు వచ్చిన వార్తలపై.. ఏకంగా భారత్ ను ప్రశ్నిస్తోంది. ఈపరిణామంతో అమెరికా.. భారత్ కు మిత్రదేశమేనా అన్న అనుమానం.. భారతీయుల్లో వ్యక్తమవుతోంది. వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసం .. ఆత్మగౌరవం, దేశంగా తనకున్న హక్కులను సైతం… మోడీ సర్కార్ తాకట్టుపెడుతోందా అన్న అనుమానాలు భారతీయుల్లో వ్యక్తమవుతున్నాయి.













