ముస్తాబవుతున్న మాటా రెండో మహాసభలు.. తెలుగు వారి కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, లీగల్ సెమినార్లు
న్యూయార్క్: అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమం తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) రెండో వార్షిక మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 2026 జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో గల గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు రూపొందించిన ఈ కన్వెన్షన్ కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, సాంకేతిక, ఆరోగ్య వ్యాపార రంగాల్లో వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరించనుంది.
ఇవి కూడా చదవండి
ఎన్నెన్నో కార్యక్రమాలు..
మాటా రెండో కన్వెన్షన్‌లో భాగంగా భద్రాచల దేవస్థానం నుండి ప్రత్యేకంగా విచ్చేసే అర్చకుల సమక్షంలో శ్రీ సీతారామ కల్యాణం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరిగే ఈ క్రతువులో భద్రాద్రి నుండి తెచ్చిన దివ్య విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. భక్తులకు పవిత్ర ప్రసాదం తలంబ్రాలు అందజేస్తారు. ఆధ్యాత్మికతతో పాటు యువతను ప్రోత్సహించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు రామ్ మిర్యాల వంటి ప్రముఖ కళాకారులతో కూడిన సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.
సంగీత పోటీలు..
సాంకేతిక రంగంలో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం మాటా ఫిలడెల్ఫియాలో ఫ్యూచరిస్టిక్ ఏఐ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. మిడిల్ స్కూల్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థుల వరకు పాల్గొనే ఈ పోటీలో విజేతలకు 1000 డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే వర్ధమాన గాయకుల కోసం మాటా సింగింగ్ స్టార్ పోటీలను ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ రామచారి కొమ్మండూరి పర్యవేక్షణలో చేపడుతున్నారు. వీటితో పాటు జనవరి నుండి ప్రారంభమైన 100 రోజుల ఫిట్నెస్ ఛాలెంజ్ విజేతలకు కూడా కన్వెన్షన్ వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఆరోగ్య శిబిరాలు..
సామాజిక బాధ్యతలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రతి నెలా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ, కమ్యూనిటీకి మాటా తన వంతు సహకారం అందిస్తోంది. ప్రతి నెలా ఆఖరి శనివారం ఇమ్మిగ్రేషన్, ఫ్యామిలీ లా రియల్ ఎస్టేట్ అంశాలపై నిపుణులైన న్యాయవాదులతో లీగల్ సెమినార్లు కూడా జూమ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల విజయానికి కిరణ్ దుడ్డగి నేతృత్వంలోని కార్యవర్గ బృందం వివిధ కమిటీ సభ్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక వెండర్ బూత్‌లు సావనీర్ ప్రకటనల సౌకర్యం కూడా కల్పించారు. మరింత సమాచారం కోసం www.mata-us.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇవి కూడా చదవండి
త్వరలో జరగబోతున్న ఈవెంట్స్‌కి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి








