Lavanya Tripathi: చిరంజీవిపై విమర్శలు..ట్రోలర్లకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్!
Lavanya Tripathi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన శుభవేళ, మెగా కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో, కొందరు నెటిజన్లు గతంలో చిరంజీవి ‘వారసుడు’ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ధోరణిని లావణ్య త్రిపాఠి ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
అభ్యంతరకర పోస్టులపై ఆగ్రహం:
“మీరు పెడుతున్న పోస్ట్‌లు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక కుటుంబం జరుపుకుంటున్న ఆనందకరమైన వేడుకను పాడు చేసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి” అంటూ లావణ్య మండిపడ్డారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి తెలియని వారు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన తన ఇంట్లోని మహిళలతో, మనవరాళ్లతో ఎంత ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉంటారో బయటి ప్రపంచానికి తెలియదని, చిరంజీవి సమాజం కోసం, తన కుటుంబం కోసం చేసే పనుల్లో విమర్శకులు ఒక శాతం కూడా చేయలేరని ఆమె హితవు పలికారు.
మెగాస్టార్‌కు అండగా కోడలు:
చిరంజీవికి ఆడపిల్లలన్నా, మనవరాళ్లన్నా ఎంతో ప్రాణమని.. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని లావణ్య స్పష్టం చేశారు. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వారి గురించి పూర్తి అవగాహన ఉండాలని ఆమె సూచించారు. ఈ మెగా కోడలి ధైర్యమైన స్పందన చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో లావణ్య చూపిన చొరవ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ కవలల రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.






