సాయి పల్లవి నో.. సమంత యెస్.. ఫలితం హిట్టేనా?
తెలుగు ప్రేక్షకులకు ఎంతో కాలం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి తెలుగు సినిమాతో ముందుకు వస్తున్న స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నటిస్తున్న మా ఇంటి బంగారం(Maa inti bangaram) సినిమా జూన్ 19న రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ పై గత కొంతకాలంగా పలు ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఈ సినిమా అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమంత తాజాగా మరోసారి స్పష్టం చేసింది. నందిని రెడ్డి(Nandini reddy) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించడంతో పాటు, ఆమె భర్త రాజ్ నిడిమోరు(Raj nidimoru) కథను అందించి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, మా ఇంటి బంగారం సినిమాలో ప్రధాన పాత్ర కోసం దర్శక నిర్మాతలు తొలుత సాయి పల్లవిని సంప్రదించారట. కథ విన్న సాయి పల్లవి కూడా కథనం పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అప్పటికే రామాయణంతో పాటు మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భారీగా డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాకు అవసరమైన కాల్షీట్లు ఇవ్వలేకపోయిందని సమాచారం.
దీంతో ఆ పాత్ర సమంత వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమె నటించడమే కాకుండా నిర్మాణ బాధ్యతల్లో కూడా భాగస్వామిగా మారినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య(Gulshan Devayya) కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు సంగీత సంచలనం సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) సంగీతం అందిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదాత్మక అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా సమంతకు తెలుగు మార్కెట్లో మరో బలమైన కంబ్యాక్‌గా నిలుస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.








