మరోసారి సత్తా చాటిన అనురాగ్ కశ్యప్
బాలీవుడ్లో ఒకప్పుడు సంచలన డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్(Anurag kashyap) మళ్లీ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు, వివాదాలు, నటుడిగా బిజీ కావడం వంటి కారణాలతో డైరెక్షన్ కు దూరంగా ఉన్న ఆయన తాజాగా తెరకెక్కించిన బందర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డియోల్(bobby deol) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా పరిమిత స్థాయిలో విడుదలైనప్పటికీ, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా కథన విధానం, భావోద్వేగాల ప్రదర్శన, నటీనటుల సహజ నటన సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.
అనురాగ్ కశ్యప్‌కు ప్రత్యేకమైన రియలిస్టిక్ మేకింగ్ స్టైల్ ఈ సినిమాలో మరోసారి స్పష్టంగా కనిపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజానికి సంబంధించిన ఓ సున్నితమైన అంశాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తోందని చెబుతున్నారు. బాబీ డియోల్ తన కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్రను పోషించగా, సాన్యా మల్హోత్రా(Sanya malhotra), సప్నా పబ్బి(sapna pabbi), సబా ఆజాద్(Saja anand), ఇంద్రజిత్ సుకుమారన్(indrajith sukumaran), రాజ్ బి. శెట్టి(Raj B. Setty) తదితరులు తమ నటనతో కథకు మరింత బలం చేకూర్చారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిత్ర బృందం ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించలేదు. అయినప్పటికీ తొలి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ గణనీయంగా పెరిగింది. మౌత్ టాక్ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. సాఫ్రన్ మ్యాజిక్‌వర్క్స్ నిర్మించిన బందర్(Bandar) ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారి, కంటెంట్ ఆధారిత సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తోంది.








