MGR Row: ఎంజీఆర్ వర్సెస్ కాంతారావు.. క్షమాపణతో వివాదం ముగించిన రాజేంద్రుడు..
హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ నోరు జారారు. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయన నటన చూసి ఎంజీఆర్ భయపడేవారని, వణికిపోయేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటులు విశాల్, నాజర్‌తో పాటు పలువురు తీవ్రంగా స్పందించారు.
రాజేంద్రప్రసాద్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. తమ ఆరాధ్యదైవం ఎంజీఆర్ ను విమర్శించడం ఏంటని వారు గట్టిగానే నిలదీశారు. దీనికి తోడు తమిళ నెటిజన్లు సైతం.. రాజేంద్రప్రసాద్ ను ట్రోల్ చేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ దిగొచ్చారు. తనకు ఎంజీఆర్ ఆరాధ్య దైవమేనని.. కాంతారావును ప్రశంసించే సమయంలో కాస్త నోరు జారానన్నారు. తనను క్షమించాలని ఎంజీఆర్ అభిమానులు, తమిళ చిత్రపరిశ్రమను కోరారు రాజేంద్రుడు.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం పట్ల తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్(Vishal) కృతజ్ఞతలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం ఆయన క్షమాపణతో ముగిసిన నేపథ్యంలో విశాల్ స్పందించారు. ఇది రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని అభినందించారు.
ఎంజీఆర్‌ను అభిమానించే ఎంతోమంది ఆయన వ్యాఖ్యలతో బాధపడ్డారని, ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) వివరణ కూడా కోరిందని విశాల్ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడాన్ని తాను మెచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.







