ఐదేళ్లలో తొలిసారిగా తగ్గిన ఉద్యోగులు.. కానీ ఖర్చులు మాత్రం వేల కోట్లు..!
భారత బ్యాంకింగ్ రంగాన్ని శాసించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత, ఉద్యోగాల కల్పనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. స్వయంగా కేంద్ర బ్యాంకే తన సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఆర్బీఐలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. తాజాగా విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదిక ఈ సంచలన మార్పును వెలుగులోకి తెచ్చింది.
తగ్గిన కింది స్థాయి సిబ్బంది..
ఆర్బీఐ (RBI) అధికారిక గణాంకాల ప్రకారం.. 2024 ముగింపు నాటికి సంస్థలో మొత్తం 13,520 మంది సిబ్బంది పని చేస్తుండగా, 2025 చివరి నాటికి ఆ సంఖ్య 13,220 కి పడిపోయింది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే దాదాపు 2.2 శాతం మేర ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. అయితే ఈ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆర్బీఐలో క్లాస్-3, క్లాస్-4 విభాగాలకు చెందిన కింది స్థాయి ఉద్యోగుల సంఖ్య మాత్రమే తగ్గింది. అదే సమయంలో, ఉన్నత స్థాయి కేటగిరీ అయిన క్లాస్-1 అధికారుల సంఖ్య మాత్రం 7,325 నుంచి ఏకంగా 7,517 కి పెరిగింది. దీనికి తోడు కొత్త నియామకాల (Hiring) వేగం కూడా ఆర్బీఐలో (RBI) గణనీయంగా మందగించింది. 2024 సంవత్సరంలో 604 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోగా.. 2025 వచ్చేసరికి ఆ సంఖ్య కేవలం 247 మందికి పరిమితమైంది. అంటే కొత్త నియామకాలు సగానికి పైగా తగ్గిపోయాయని ఈ నివేదిక చెప్తోంది.
ఉద్యోగులు తగ్గినా.. ఖర్చులు మాత్రం..
సాధారణంగా ఏ సంస్థలోనైనా (RBI) ఉద్యోగుల సంఖ్య తగ్గితే వారిపై పెట్టే ఖర్చు కూడా తగ్గాలి. కానీ ఆర్బీఐ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన ఫలితం కనిపించింది. సిబ్బంది సంఖ్య తగ్గినా, ఉద్యోగుల కోసం అయ్యే వ్యయం మాత్రం అమాంతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఉద్యోగుల ఖర్చు 10.8 శాతం పెరిగి ఏకంగా రూ. 10,136 కోట్లకు చేరుకుంది. పెన్షన్ రివిజన్ (Pension Revision) చేయడంతో పాటు, పదవీ విరమణ చేసిన వారి నిధుల (Retirement Funds) కోసం కేంద్ర బ్యాంక్ (RBI) భారీగా కేటాయింపులు జరపడమే ఈ అదనపు వ్యయానికి ప్రధాన కారణం.
దీని వెనుక ‘డిజిటల్’ స్కెచ్ ఏంటి?
ఆర్థిక వ్యవస్థ మారుతున్న తరుణంలో ఆర్బీఐలో (RBI) ఉద్యోగులు తగ్గడానికి, నియామకాలు మందగించడానికి వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ తన రోజువారీ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో డిజిటలీకరణ (Digitization) వైపు నడిపిస్తోంది. మనుషుల శ్రమను తగ్గిస్తూ ఆటోమేషన్ ప్రక్రియను వేగంగా విస్తరిస్తోంది. ఇందుకో భాగంగానే ఆర్బీఐ ‘ఈఆర్ఎం ఫ్రేమ్‌వర్క్ 2.0’ను అమలు చేయడంతో పాటు, రిస్క్ మేనేజ్మెంట్, ఆడిట్ వ్యవస్థల్లో అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘ఉత్కర్ష్ 2029’ (Utkarsh 2029) అనే ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సాంకేతిక మార్పుల వల్లే క్లరికల్, కింది స్థాయి సిబ్బందిపై ఆధారపడటం తగ్గి, ఆర్బీఐ ఒక స్మార్ట్ ఆర్గనైజేషన్‌గా మారుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








